
జైషే, లష్కరే తొయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్ వంటి కరుడు గట్టిన ఉగ్ర సంస్థలకు పాకిస్థాన్ ఇంకా ఆతిథ్యం ఇస్తోందని భారత భద్రతా దళాలు వెల్లడించాయి. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై అంతర్జాతీయ స్థాయిలో ఒత్తిడి ఉన్నప్పటికీ ఉగ్రమూకలు పాక్‌లోనే శిక్షణ పొందుతున్నట్లు తెలిపాయి. పుల్వామా ఘటన తర్వాత పాక్‌లో 24 కీలక ఉగ్ర స్థావరాల వివరాలు (గూగుల్ మ్యాప్ రిపోర్ట్ సహా) పాక్‌కు భారత్ పంపినప్పటికీ వాటిలో ఒక్క స్థావరాన్ని కూడా పాక్ మూసేయలేదని వెల్లడించాయి. బాలాకోట్‌లో జైషే, బరాలీ లేదా ఫిగోష్ 1,2 సెక్టార్లలో లష్కరే తోయిబా, బార్నాలో హిజ్బుల్ ముజాహిద్దీన్, భవాల్పూర్, బతార్సీలోని 1,2 క్యాంపుల్లో జైషే, చేలబండిలో లష్కరే, జైషే, దౌరా ఈ అజీమత్లో హిజ్బుల్ ఉగ్రమూకల స్థావరాలు ఉన్నట్లు తెలిపాయి.
ఈ స్థావరాలన్నీ ఎక్కువగా పాక్ ఆక్రమిత కశ్మీర్, మాన్షేరా, పెషావర్, భావల్పూర్, లాహోర్‌లో ఉన్నట్లు గుర్తించారు. భద్రతా దళాలు చెప్పిన వివరాల ప్రకారం జైషే ఉగ్ర సంస్థకు చెందిన ఆపరేషనల్ కమాండర్ ముఫ్తీ అబ్దుల్ రాఫ్ అస్ఘార్, అతడి సోదరుడు మౌలానా అమ్మర్ రావల్పిండిలో నవంబరు 10న సంచరించారు. ఆర్థిక సాయం పొందేందుకు వారు అక్కడికి వచ్చినట్లు భారత భద్రతా దళాలకు సమాచారం అందింది. ఆయా సంస్థల మీదున్న ఆంక్షలు ఎత్తివేత, భవిష్యత్తు కార్యాచరణ వంటి అంశాలపై ఈ ఇద్దరు జైషే అధినేతలతో చర్చించినట్లు తెలుస్తోంది.#TERRORISM
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.





