News

మా సహనాన్ని పరీక్షించొద్దు – పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్‌ వార్నింగ్‌

244views

పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత్‌ ‘ఆపరేషన్‌ సిందూర్‌’ చేపట్టిన సంగతి తెలిసిందే. దీంతో భారత్‌లోని సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేపట్టేందుకు పాక్‌ యత్నించగా.. వీటిని భారత దళాలు దీటుగా తిప్పికొట్టాయి. ఈ క్రమంలో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌ సహనాన్ని అలుసుగా తీసుకుంటే ఆపరేషన్‌ సిందూర్‌ తరహా చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. ‘నేషనల్‌ క్వాలిటీ కాంక్లేవ్‌’లో మాట్లాడుతూ దేశభద్రతకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడబోమని స్పష్టంచేశారు.

‘‘మేం ఎల్లప్పుడూ సంయమనంతో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తాం. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవడాన్ని విశ్వసిస్తాం. దీనర్థం ఎవరైనా మా ఓపికను దుర్వినియోగం చేయవచ్చని కాదు. మా సహనాన్ని అవకాశంగా తీసుకోవాలని ప్రయత్నిస్తే.. ఆపరేషన్‌ సిందూర్‌ మాదిరిగా తీవ్ర పర్యవసానాలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి’’ అని రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు.
సైన్యంపై ప్రశంసలు..

భారత బలగాలు ఆపరేషన్‌ సిందూర్‌ను ఊహించని కచ్చితత్వంతో అమలు చేశాయని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు. పాకిస్థాన్‌తోపాటు పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రస్థావరాలను ధ్వంసం చేశాయని, ఇందులో అనేకమంది ఉగ్రవాదులు హతమయ్యారని చెప్పారు. ఈ ఆపరేషన్‌లో సాయుధ బలగాలు ధైర్యసాహసాలు ప్రదర్శించాయని ప్రశంసించారు. సామాన్యులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా ఈ ఆపరేషన్‌ చేపట్టామని, అత్యాధునిక పరికరాలు, సుశిక్షితులైన సాయుధ దళాల పనితీరువల్లే ఇది సాధ్యమైందన్నారు.