
కేంద్ర విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ గురువారం ఆపరేషన్ సిందూర్ పై భారతదేశ వైఖరిని పునరుద్ఘాటించారు. ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది భారత పౌరులు మరణించిన తర్వాత, పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్(PoK)లోని ఉగ్రవాద స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకొని భారత్ దాడులు నిర్వహించిందని స్పష్టం చేశారు. వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కల్నల్ సోఫియా ఖురేషిలతో కలిసి విలేకరుల సమావేశంలో మిస్రి ప్రసంగించారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన దీర్ఘకాల పాత్రను ఈ సందర్భంగా ఆయన ఖండిస్తూ, “ప్రపంచ ఉగ్రవాదానికి కేంద్ర బిందువుగా పాకిస్తాన్ ఖ్యాతిని కలిగి ఉంది. లష్కరే తోయిబా(LeT), జైషే మొహమ్మద్(JeM) వంటి అనేక నిషేధిత ఉగ్రవాద గ్రూపులకు పాక్ నిలయంగా ఉంది,”అని అన్నారు. ప్రపంచ ఉగ్రవాద నిరోధక ప్రయత్నాలపై పాకిస్తాన్ ద్వంద్వ వైఖరిని కేంద్ర విదేశాంగ మంత్రి తప్పుబట్టారు. పహల్గామ్ ఉగ్రవాద దాడిని ఖండిస్తూ ఐక్యరాజ్యసమితి చేసిన ప్రకటనలో ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) పేరుని తొలిగించాలని పాకిస్తాన్ ఒత్తిడి చేయడం ఇందుకు ఉదాహరణ అని ఆయన అన్నారు.





