
ఆరు నెలల తర్వాత ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో ఉన్న బద్రీనాథుడి ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పేరిట ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ తొలి మహాభిషేక పూజను నిర్వహించారు. లక్ష్మీదేవి, వినాయకుడు సహా ఆలయ ప్రాంగణంలోని అన్ని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు 15 టన్నుల రకరకాల అందమైన పుష్పాలతో ఆలయాన్ని అలంకరించారు. దేశం నలుమూలలతో పాటు నేపాల్ నుంచి వచ్చిన వందల మంది భక్తులు బద్రీనాథుడిని దర్శించుకున్నారు. బద్రీనాథ్ ధామ్ తలుపులు తెరుచుకున్న నేపథ్యంలో మానా, బామ్ని గ్రామానికి చెందిన మహిళలు ఆలయ ప్రాంగణంలో నృత్యం చేశారు. 2025 ఏప్రిల్ 30న గంగోత్రి, యమునోత్రి ఆలయాల తలుపులు తెరవడం వల్ల చార్‌ధామ్ యాత్ర ప్రారంభమైంది. మే 2న, భక్తుల కోసం కేదార్‌నాథ్ ధామ్ తలుపులు తెరుచుకోగా, బుధవారం బద్రీనాథ్ ధామ్ తలుపులు తెరుచుకున్న విషయం తెలిసిందే. దీంతో ఛార్‌ధామ్ యాత్ర సంపూర్ణంగా ప్రారంభమైంది.





