
దేశంలోని దాదాపు చాలా భాషలకు సంస్కృత భాష అమ్మలాంటిదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. సంస్కృతం బలోపేతమైతేనే, మిగతా భాషలకూ బలం వస్తుందని అన్నారు. ప్రస్తుతం దేశంలో సంస్కృత భాష పునరుజ్జీవానికి అనుకూల వాతావరణం ఉందని, ప్రభుత్వమూ అందుకు సహకరిస్తోందని తెలిపారు. అమిత్ షా ఆదివారం ‘సంస్కృత సంభాషణ్ శిబిరం’ ముగింపు కార్యక్రమంలో ప్రసంగించారు. ‘‘సంస్కృత భాష.. భారత ఆత్మ. మన సంప్రదాయం. వేల ఏళ్ల నుంచి జరిగిన పరిశోధనలు ఈ భాషలోనే ఉన్నాయి. వ్యాకరణం, సంగీతం, యోగా, ఆయుర్వేదం, గణితం, కాలగణన పద్ధతులు, పర్యావరణం ఇలా పలు రంగాలకు చెందిన జ్ఞానమంతా సంస్కృతంలోనే ఉంది. ఇది మొత్తం విశ్వానికి అందాలి. ఏ భాషకూ మేం వ్యతిరేకం కాదు. అమ్మకు దూరంగా ఎవరూ ఉండలేరు. దేశంలో దాదాపు చాలా భాషలకు సంస్కృతం అమ్మలాంటిది. ఇది ఎంత బలపడితే దేశంలోనూ మిగతా భాషలూ అంతే బలోపేతమవుతాయి’’ అని పేర్కొన్నారు.





