News

ఎన్ఆర్ సీ ప్రక్రియను వెంటనే చేపట్టాలి : విశ్వ హిందూ పరిషత్ డిమాండ్

381views

దేశంలో జనాభా లెక్కలతో పాటే ఎన్ఆర్ సీ -నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ప్రక్రియను వెంటనే చేపట్టాలని విశ్వ హిందూ పరిషత్ -వీహెచ్ పీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. భారత్ లో అక్రమంగా ఉంటున్న పాకిస్థాన్ పౌరులనూ తక్షణమే స్వదేశానికి తిరిగి పంపించేయాలని పేర్కొంది. ఈ మేరకు వీహెచ్ పీ సంయుక్త ప్రధాన కార్యదర్శి సురేంద్ర జైన్ ఓ ప్రకటన విడుదల చేశారు.

“జమ్మూ కశ్మీర్ లోని పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్ పౌరులకు జారీ చేసిన అన్ని రకాల వీసాలను భారత్ రద్దు చేసింది. ఈ నేపథ్యంలో పాక్ కు చెందిన వారు కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పెద్ద సంఖ్యలో ఉంటున్నట్లు తేలింది. అందులో కొందరు ఏకంగా ఆధార్, రేషన్, ఓటర్ కార్డులూ పొందారు. ఈ క్రమంలో వెంటనే ఎన్ఆర్సీ ప్రక్రియను మొదలెట్టి, భారత్ పౌరులు కాని వారిని, పాకిస్థాన్ పౌరులను వెంటనే పంపించేయాలి. అలాగే పాక్ కు చెందిన వారు ఇక్కడి ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండటంపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలి” అని అందులో డిమాండ్ చేశారు. కాగా.. భారత్ కు వీసాపై వచ్చిన తాను జమ్మూ కశ్మీర్లోని బారాముల్లా జిల్లాలో 17 ఏళ్ల నుంచి ఉంటున్నానని, తనకు ఇక్కడ ఆధార్ కార్డుతో పాటు ఇతర ధ్రువీకరణ పత్రాలూ ఉన్నాయని, ఇక్కడ జరిగిన ఎన్నికల్లో ఓటు కూడా వేశానని పౌక్ పౌరుడు మాట్లాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఇప్పటికే అతడిని పాక్ కు పంపించేసిన అధికారులు.. దీనిపై ఎస్ఐఆర్ నమోదు చేసి, సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు.