
ఈ యేడాది జూన్ 5 నాటికి రామ మందిర నిర్మాణం పూర్తవుతుందని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా మంగళవారం ప్రకటించారు. ఇప్పటికే ఆలయ నిర్మాణ పనులు 99 శాతం పూర్తయ్యాయని తెలిపారు. ఓ ఇంగ్లీషు మీడియా చానెల్ తో మాట్లాడుతూ నృపేన్ మిశ్రా ఈ విషయాలను వెల్లడించారు.
‘‘ఈ యేడాది జూన్ 5 నాటికి రామాలయ నిర్మాణం పూర్తవుతుంది. ఆలయ నిర్మాణ పనులు 99 శాతం ఇప్పటికే పూర్తయ్యాయి. రామలల్లా ప్రతిష్ఠించిన గర్భుగడి ఇప్పటికే పూర్తైంది. అయితే మొదటి, రెండవ అంతస్తులు, పైన వున్న శిఖరం నిర్మాణ పనులు ఇంకా కొనసాగుతున్నాయి. శిఖరం పైన ధ్వజస్తంభం కూడా ప్రతిష్ఠించబడింది. శిఖరం పని పూర్తయ్యిందని సూచించే సంకేతాలివి. రాముడు, సీత, హనుమంతుడు వుండే మొదటి అంతస్తులో రామ దర్బార్ మే 23 న జరుగుతుంది. దీనికి సంబంధించిన సన్నాహాలు కూడా పూర్తయ్యాయి. మే 23 న అయోధ్యకు విగ్రహాలు చేరుకుంటాయి. వాటిని గర్భగుడిలో వుంచుతాం. దీని తర్వాత సంప్రదాయ వేడుకలు జరుగుతాయి. జూన్ 5 న సంప్రదాయాల ప్రకారం ప్రతిష్ఠిస్తాం’’ అని నృపేన్ మిశ్రా ప్రకటించారు.
అలాగే రాముడితో సంబంధమున్న ఋషుల దేవాలయాల నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ అత్యంత ప్రాముఖ్యం ఇచ్చారని నృపేన్ మిశ్రా అన్నారు. ఈ ఏడు ఆలయాల నిర్మాణం కూడా పూర్తైందన్నారు. ఆలయ ప్రాంగణంలో వున్న వాల్మీకి, వశిష్ఠ, విశ్వామిత్ర, అహల్య, నిషాదరాజ్ మహారాజ్, శబరి మాత, అగస్త్యముని ఆలయాలు కూడా జూన్ 5 తర్వాత ప్రజల సందర్శనార్థం వుంచుతామని ప్రకటించారు.





