News

పహల్గాంలో ఉగ్రదాడిపై వివాదాస్పద పోస్టులు 30 మంది అరెస్ట్

268views

పహల్గాంలో ఉగ్రదాడి అనంతరం సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు పెట్టిన 30 మందిని అరెస్ట్ చేసినట్లు అసోం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ వెల్లడించారు. వీరంతా పాకిస్థాన్‌కు అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్టులు చేశారన్నారు. వీరి గత చరిత్రను పరిశీలించి.. నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. పాక్, భారత్‌ల మధ్య సారూప్యత లేదన్నారు. ఈ రెండింటి మధ్య వైరం ఉందని గుర్తు చేశారు.

ఈ అరెస్టయిన వారిలో అసోం, మేఘాలయా, త్రిపుర రాష్ట్రాలకు చెందిన వారు సైతం ఉన్నారన్నారు. తొలుత 24 మందిని అరెస్ట్ చేశామని చెప్పారు. వీరిలో ఎమ్మెల్యేతోపాటు విద్యార్థులు, పాత్రికేయులు, ఉపాధ్యాయులు సైతం ఉన్నారని వివరించారు. అయితే 2019 పుల్వామా దాడి ఘటన నుంచి ఇటీవల చోటు చేసుకున్న పహల్గాం ఉగ్రదాడి వరకు అన్ని ప్రభుత్వం కుట్రలంటూ ఆరోపణలు గుప్పించిన తమ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యే అమీనుల్ ఇస్లాంపై ఇప్పటికే దేశద్రోహం కింద కేసు నమోదు చేశామని తెలిపారు.