
మత ప్రాతిపదికన 26 మందిని చంపినా పాకిస్థాన్‌కు అనుకూలంగా మాట్లాడటం సరికాదని, అలా మాట్లాడాలనుకుంటే ఆ దేశానికే వెళ్లిపోవాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. మత ప్రాతిపదికన చంపడం సరికాదన్నారు. ఇటీవల జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి మంగళగిరి సి.కె.కన్వెన్షన్‌లో హాలులో నివాళుల కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ఉగ్రవాదం, హింసపై అందరూ ఒకేలా స్పందించాలన్నారు. కశ్మీర్ భారత్‌లో భాగమని, ఇలాంటి విషయాలపై ఓట్లు, సీట్ల కోసం మాట్లాడకూడదని చెప్పారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన శ్రీపొట్టి శ్రీరాములు జిల్లా కావలికి చెందిన మధుసూదన్‌రావు కుటుంబానికి పార్టీ తరఫున రూ.50లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.
‘‘సత్యం మాట్లాడాలంటే చాలా ధైర్యం కావాలి. చనిపోయిన మధుసూదన్‌రావు ఎవరికి హాని చేశారు?. కుటుంబాన్ని తీసుకొని కశ్మీర్‌కు వెళ్తే చంపేశారు. కశ్మీర్ మనది కాబట్టే అక్కడికి వెళ్లామని మధు భార్య చెప్పారు. హిందువులకు ఉన్న దేశం ఇదొక్కటే. ఇక్కడ కూడా ఉండొద్దంటే ఎక్కడికి పోవాలి?. యుద్ధ పరిస్థితులు వచ్చినా సిద్ధంగా ఉండాలి. మత కలహాలు సృష్టించే వారిపై అప్రమత్తంగా ఉండి ఎదుర్కోవాలి’’ అని పవన్ కల్యాణ్ అన్నారు.





