
అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం-ఇస్కాన్ సనాతన ధర్మాన్ని మేల్కొల్పడానికి దేశ వ్యాప్తంగా చేపట్టిన రథయాత్రకు అనకాపల్లి జిల్లాలోని కశింకోటలో భక్తులు నీరాజనాలు పలికారు. స్థానిక సత్యసాయి మందిరం నుంచి రాధాకృష్ణుల విగ్రహాలను ఎడ్ల బండిపై సంతబయల వరకు ఊరేగించారు. ఆ సమయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్థానిక ధ్యాన వేంకటేశ్వరస్వామి మందిరంలో ప్రత్యేక పూజలు చేసి గౌరీ హారతి ఇచ్చారు.

ఈ సందర్భంగా ఇస్కాన్ సంస్థాపక ఆచార్య అభయ చరణారవింద భక్తి వేదాంతస్వామి, ప్రతినిధులు మాట్లాడుతూ దీన్ని ద్వారక నుంచి ప్రారంభించి కేథార్‌నాథ్, బద్రీనాథ్, బృందావనం, అయోధ్య, జనకపూర్, మాయాపూర్, పూరి జగన్నాథ్, శ్రీకూర్మం, సింహాచలంలో నిర్వహించామన్నారు. తర్వాత మంగళగిరి, తిరుపతి, అహోబిలం, రామేశ్వరంల మీదుగా కన్యాకుమారికి చేరడంతో యాత్ర ముగుస్తుందన్నారు. రామాయణం, భగవద్గీత పుస్తకాలను పంపిణీ చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.





