
జమ్మూకశ్మీర్‌లో పహల్గాంలో ఉగ్రదాడి వెనుక పాక్ లష్కరే-ఎల్‌ఈటీ కమాండర్ ఖలీద్ పేరు బయటకు వచ్చింది. అసలు ఎవరితడు.. పహల్గాం దాడితో సంబంధం ఏమిటీ అనేది తేల్చేపనిలో దర్యాప్తు బృందాలున్నాయి. పాక్‌కు చెందిన లష్కరే సంస్థలో ఖలీద్ చాలా కీలక వ్యక్తి. అతడి అసలు పేరు సైఫుల్లా కసూరి. లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్‌కు అత్యంత సన్నిహితుడు.
ఖలీద్ ప్రస్తుతం లష్కరే పెషావర్ ప్రధాన కార్యాలయానికి అధిపతి,. అతడిని మిల్లీ ముస్లింలీగ్ సంస్థకు అధ్యక్షుడిగా కూడా చెబుతుంటారు. ఇది హఫీజ్ సయీద్‌కు చెందిన జమాత్ ఉద్ దవా(జేయూడీ)కు రాజకీయ విభాగం. ఈ జమాత్ విభాగం పంజాబ్ ప్రావిన్స్ సమన్వయ విభాగం కూడా ఇతడే చూస్తున్నాడు. ప్రస్తుతం జేయూడీని అమెరికా విదేశాంగశాఖ లష్కరే అనుబంధ సంస్థగా గుర్తించి.. ఉగ్ర ముద్ర వేసింది.
పాక్ ఆర్మీతో కలిసి పనిచేశాడా..?
ఈ ఉగ్రదాడిలో ఉగ్రవాదుల బృందానికి నాయకత్వం వహించింది ఆసీఫ్ ఫౌజీగా భావిస్తున్నారు. అతడు జమ్మూకశ్మీర్ ప్రాంతానికి చెందినవాడే. తాజాగా దర్యాప్తు బృందాలు విడుదల చేసిన ఊహా చిత్రాల్లో ఫౌజీది కూడా ఉంది. ఇతడు పాకిస్థాన్ ఆర్మీతో కలిసి పనిచేయడంతో పేరు వెనక ఫౌజీ అనేది వచ్చినట్లు ఇండియా టీవీ కథనం పేర్కొంది. ఈ దాడి తర్వాత ఉగ్రవాదులు ముజఫరాబాద్‌లోని సేఫ్ హౌస్ దిశగా వెళ్లినట్లు దర్యాప్తు బృందాలు అనుమానిస్తున్నాయి.





