News

బోర్డర్ భారతి

299views

పాకిస్తాన్లోని సింధ్ ప్రాంతం నుంచి 149 మంది భారత్ కు వస్తున్నారు. అందులో జాతా అనే వర్గానికి చెందిన ముగ్గురు ఉన్నారు. వాఘా సరిహద్దు దాటగానే ఈ వర్గానికి చెందిన ఒక మహిళకు పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. ఆమె పేరు మాయ. భర్త పేరు ఖన్నో స్థానికులు వెంటనే ఆమెను అట్టారిలోని ఒక ఆసుపత్రిలో చేర్చారు. మాయ సుఖ ప్రసవంతో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఏప్రిల్ 4న ఇది జరిగింది. ఆమెను ఆసుపత్రిలో చేర్చుకోవాడానికి వీలుగా ఇమిగ్రేషన్ అధికారులు కూడా విధివిధానాలు పూర్తి చేసి సహకరించారు. వెంటనే చిన్నారికి చక్కని పేరు కూడా పెట్టారు – భారతి. మాయ పేరుతో భారత్లోకి అడుగు పెట్టిన ఆమె సంతాన లక్ష్మి కూడా. భారతితో కలిపి ఆమెకు పదిమంది సంతానం. అందులో భారతి ఎనిమిదో కూతురు. డిసెంబర్ 2, 2021న కూడా ఇలాంటి శుభ సందర్భమే వాఘా సరిహద్దులలోనే సంభవించింది. ఇంతకీ ఈ 149 మంది హిందువులు హరిద్వార్ను దర్శించుకోవడానికి వెళుతున్నారు. అంటే అక్కడ నుంచి హరిద్వార్ కు ఆ పూర్ణ గర్భిణి కూడా బయలుదేరిందన్నమాట.

ఆసుపత్రిలో ఒక పాకిస్తాన్ హిందూ మహిళ అడ శిశువుకు జన్మనిచ్చిన సంగతి తెలిసి విజయ్ వర్మ అనే అట్టారీ వాసి అక్కడికి వెళ్లి అభినందనలు తెలియచేశారు. అక్కడ అందరికీ మిఠాయిలు కూడా పంచి పెట్టారు. భారతీయులందరి తరఫున ఆయనే శిశువుకు ఆశీస్సులు కూడా అందించారు. నింబు బాయి అనే పాకిస్తానీ హిందూ మహిళ (భర్త పేరు బాలన్రామ్) మగ శిశువుకు జన్మనిచ్చింది. ఆ చిన్నారికి పెట్టిన పేరు ఏమిటో తెలుసా? సరిహద్దు రాముడు. అయితే ఇలాంటి పురుళ్లలో ఒక లోపాయికారి విషయం కూడా ఉంది. పాకిస్తాన్లో బాధలు భరించలేక భారత్ కు రావాలనుకున్న వాళ్లు ఈ వ్యూహం కూడా అనుసరిస్తారట. అలా భారత్లో శాశ్వత నివాసం పొందుతారట.