
ఏపీ రాజధాని పరిధిలోని తాడికొండ ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం నుంచి ఎన్నికైన వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి కుల ధృవీకరణపై కొంతకాలంగా జరుగుతున్న రగడ ఏకంగా రాష్ట్రపతి భవన్ దృష్టికి వెళ్ళింది. ఇప్పటికే ఈమె కులంపై కోర్టులో కూడా పిటీషన్ లు దాఖలయ్యాయి. శ్రీమతి శ్రీదేవి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను క్రిస్టియన్ అని, తన భర్త కాపు కులస్థుడని వ్యాఖ్యానించిన విషయంపై లీగల్ రైట్స్ ప్రొటక్షన్ ఫోరం వారు దృష్టిసారించారు. చట్ట ప్రకారం దళితులు మతం మార్చుకుంటే కులం ద్వారా వచ్చే రిజర్వేషన్ హక్కులు కోల్పోతారని, కావున శ్రీదేవి ఎన్నిక చెల్లదనే వాదనను తెరమీదకు తెచ్చారు. తాను ఎస్సీనని ఎన్నికల కమిషన్కు డాక్టర్ శ్రీదేవి తప్పుడు ధృవీకరణను దాఖలు చేసి ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందినందున ఆమె ఎన్నికను రద్దు చేయాలని లీగల్ రైట్స్ ప్రొటక్షన్ ఫోరం వారు కోర్టును ఆశ్రయించారు. అంతేగాకుండా రాష్ట్రపతికి కూడా ఈ అంశంపై ఫిర్యాదు చేశారు.
తమ వద్దకు వచ్చిన ఫిర్యాదు పైన రాష్ట్రపతి కార్యాలయం కూడా స్పందించింది. ఎమ్మెల్యే శ్రీదేవి అఫడవిట్ దాఖలులో లోపాలపై, ఎస్సీ రిజర్వేషన్ దుర్వినియోగంపై వచ్చిన అభియోగాలపై పూర్తి విచారణ జరిపించాల్సిందిగా ఏపీ చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేశారు. లీగల్ రైట్స్ ప్రొటక్షన్ ఫోరం శ్రీదేవి ఎన్నిక చెల్లదనే వాదిస్తోంది. రిజర్వ్ నియోజకవర్గమైన తాడికొండ నుండి అసలు పోటీకే శ్రీదేవికి అర్హత లేదనేది వారి వాదన. అందునా ఇప్పుడు నేరుగా రాష్ట్రపతి భవన్ వర్గాలు జోక్యం చేసుకోవటంతో ఈ వివాదం చివరికి ఎక్కడకు చేరుతుందనే ఉత్కంఠ వైయెస్సార్సీపీలో మొదలైంది.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.





