
వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంపై ఆధిపత్యం కోసం చైనా చేస్తున్న ప్రయత్నాల్లో ఎలాంటి మార్పు లేదని యూఎస్ పసిఫిక్ ఫ్లీట్ కమాండర్ అడ్మిరల్ జాన్ అక్విలినో అన్నారు. ఈ వ్యూహాత్మక ప్రాంతంలోని ఇతర దేశాలపై అనుసరిస్తున్న బెదిరింపు విధానాన్ని చైనా ఇంకా కొనసాగిస్తూనే ఉందన్నారు. భారత నావికాదళాధిపతి అడ్మిరల్ కరంబీర్ సింగ్‌తో ఆయన మంగళవారం భేటీ అయ్యారు. ఇరు దేశాల నావికాదళాల మధ్య సమన్వయం, సమాచార మార్పిడి కోసం పెంపొందించాల్సిన వ్యూహాలపై చర్చించామని అక్విలినో తెలిపారు. ఉభయుల మధ్య సమన్వయం, సహకారం రెండు దేశాలకేగాక, ఈ ప్రాంతంలోని ఇతర దేశాల అభివృద్ధికి సైతం దోహదం చేస్తుందన్నారు.
దక్షిణ చైనా సముద్రంలో చైనా కదలికలు ఈ ప్రాంతంలోని ఇతర దేశాల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. ఇక్కడున్న చిన్న ద్వీపాల్ని డ్రాగన్ దేశం సైనిక స్థావరాలుగా మార్చేస్తోందని గుర్తుచేశారు. హిందూ మహా సముద్రంలోనూ చైనా తన ప్రాబల్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. ఈ ప్రాంతంలోనూ చైనా తన మోహరింపులను భారీగా పెంచే అవకాశం ఉందన్నారు. త్వరలో ఆ దేశ విమాన వాహక నౌకలు హిందూ మహాసముంద్ర జలాల్లో ప్రవేశించే అవకాశం లేకపోలేదన్నారు.
ఈ ప్రయత్నాలు భవిష్యత్తులో మరింత పెరగొచ్చని అంచనా వేశారు. ఈ ప్రాంతంలో డ్రాగన్ చేస్తున్న నిర్మాణాలు ఆర్థికపరమైనవని చెబుతున్నప్పటికీ.. వాటిలో సైనిక లక్ష్యాలు ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోందన్నారు. భారత్, అమెరికా, జపాన్ సంయుక్త నావికా విన్యాసాలకు ఆస్ట్రేలియాను అనుమతించే విషయం ఇండియాకే వదిలేస్తున్నామన్నారు.
Source : Enadu.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.





