
‘వేదాంతులొస్తున్నారు చెంబు, తప్పేలా జాగ్రత్త పెట్టుకోండి’ అని సామెత. వేదాంతులంటే దొంగలా! వారు వస్తే చెంబు, తప్పేల జాగ్రత్త పెట్టుకోవడం. ఎందుకు? అంటే ‘ప్రపంచం అంతా మిథ్య, ఇందులో నాది నీదని ఏముంది’ అని చెప్పి కనిపించిన వస్తువుని కైవసం చేసుకునేవారు. వేదాంతులనే భావం సామాన్య ప్రజల్లో కలిగిందనడానికి ఈ సామెత ఉదాహరణ. అందరూ వేదాంతాన్ని గురించి ఇలా భావిస్తారని కాదు కాని వేదాంతాన్ని గురించి మనలో అనేక అపోహలు ఉన్నాయని మాత్రం చెప్పవచ్చు. అలాగే దానిని ఆకాశానికి ఎత్తేవారు కూడ లేకపోలేదు. వేదాంతం తాత్విక సిద్ధాంతా లన్నింటిలోకి తలమానికమని దేశ విదేశ గొప్ప గొప్ప పండితులు, తాత్వికులు, శాస్త్రజ్ఞులు కొనియాడారు. వేదాంతం గురించి తెలిసినా, తెలియకపోయినా బందరు పేరు చెప్తే లడ్డూ. కాకినాడ పేరైతే తాజా, బాపూ పేరు చెప్తే కార్టూన్లు టక్కున గుర్తు వచ్చినట్లుగానే వేదాంతం అనగానే శంకరచార్యుల పేరు గుర్తుకు వస్తుంది. వేదాంతం ఒక ఆలోచనా విధానం. ఒక జీవిత దృక్పథం. అది ఎంతో శాస్త్రీయమైనదని, ఆధునిక వైజ్ఞానిక యుగంలో ఏ సిద్ధాంతమైనా ఆలోచనా పరులను తృప్తిపరచగలదంటే అది వేదాంతమేనని వివేకానందుడు నొక్కి చెప్పాడు.
మనకి ప్రాచీనమైన సంస్కృతి ఉంది. సంస్కృతి అంటే చక్కని జీవన విధానం. మన జాతి కొన్ని వేల సంవత్సరాలుగా జీవిస్తూ వచ్చినది కాబట్టి మనకి జీవితం అన్నా, ప్రపంచం అన్నా ఒక ప్రత్యేకమైన దృష్టి ఉంది. అదే భారతీయ దృక్పథం లేదా సనాతన దృక్పథం. ఈ దృక్పథం ప్రపంచాన్ని ఆరు ముఖ్యమైన కోణాల నుంచి చూపిస్తుంది లేదా దర్శింపజేస్తుంది. కాబట్టి ఈ ఆరింటిని దర్శనములు అన్నారు. అవి సాంఖ్యము, న్యాయము, వైశేషికము, యోగము, పూర్వమీమాంస, ఉత్తర మీమాంస. ఈ ఆరూ సిద్ధాంతాలు. వీటిలో ఉత్తర మీమాంసనే వేదాంతం అని పిలవడం కద్దు. నిజానికి వేదాంతం అంటే వేదానికి అంతమందు కలవి అంటే ఉపనిషత్తులని అర్థం. ఆ ఉపనిషత్తులపై ఆధారపడిన సిద్ధాంతం కాబట్టి ఉత్తర మీమాంసను కూడ వేదాంతమనే వ్యవహరిస్తుం టారు. ఈ వేదాంతంలో మళ్లీ కొన్ని రకాలు న్నాయి. అందులో ముఖ్యమైనది అద్వైత సిద్ధాంతం. దానిని ప్రచారం చేసినవారిలో ప్రముఖులు శంకరాచార్యుడు.
శంకరాచార్యుడు ఒట్టి సిద్ధాంత కర్త మాత్రమే అయ్యుంటే ఆయనను ఇతర తాత్వికుల మాదిరిగానే గ్రంథాలయాలకో, పండితుల చర్చ లకో పరిమితం చేసేవారు. ఆయన ప్రవచించిన సిద్ధాంతం, రచించిన అనేక గ్రంథాలు, చేపట్టిన సంస్కరణలు, స్థాపించిన సంస్థలు అన్ని తరగతుల ప్రజలను ప్రభావితం చేశాయి, చేస్తు న్నాయి. కాబట్టి శంకరాచార్యుల జీవితం నుంచి సామాన్యులు కూడా తెలుసుకోవలసింది, తెలుసుకుని ఆచరించవలసింది ఎంతో ఉంది. అలాగే భారతీయ సిద్ధాంతాలన్నింటిలోకి శంకరుని అద్వైత సిద్ధాంతం ఆధునిక వైజ్ఞానిక పరీక్షలకు నిలబడి ఆధునిక దృక్పథంలోని లోటు పాట్లను పూరించగలిగినది. అది ఆధునిక సమస్య లెన్నింటికో పరిష్కారం చూపుతుంది. అందువల్ల ఈ సిద్ధాంతం భారతీయులందరికీ గర్వకారణం. బహుముఖ సమర్థమైన సిద్ధాంతాన్ని ప్రచారం చేసిన శంకరుని జీవితం చాలా ఆసక్తికరమైనది.
శంకరాచార్యులు కేరళ రాష్ట్రంలో మలబారు తీరంలోని కాలడి అనే గ్రామంలో శివగురువు, ఆర్యాంబ అనే పుణ్య దంపతులకు సాధారణ శకం 788 నందన సంవత్సరం, వైశాఖ శుద్ధ పంచమి, ఆదివారం పునర్వసు నక్షత్రంలో జన్మించారు. మన మహాపురుషులందరి కాలాల విషయంలో ఉన్నట్లుగానే శంకరాచార్యుని కాలం గురించి అనేకమైన వాదాలు, సందేహాలు ఉన్నాయి. అటువంటి సందేహాలకు ముఖ్యమైన కారణం మన ఒకప్పటి ప్రభువులైన బ్రిటిషువారు, వారి ఆస్థాన పండితులు, మన చరిత్రకీ, సంస్కృతికి మసిపూసే ప్రయత్నం చేసి జాతి ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీసి స్వతంత్రంగా నిలబడకుండా చేయడానికై అనేకమంది పాశ్చాత్య పండితులు పరిశోధన పేరుతో మన చరిత్ర, సంస్కృతిలోకి అనేకమైన తికమకలను చొప్పించారు.





