
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రమైన సియాచిన్‌ను పర్యాటకుల సందర్శన కోసం తెరిచినట్లు కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఇందుకోసం లద్ధాఖ్‌లో శ్యోక్ నది గుండా వెళ్లే వ్యూహాత్మక వంతెనను ఆయన భారత సైనికాధిపతి బిపిన్ రావత్‌తో కలసి సోమవారం ప్రారంభించారు. ఈ వంతెన శ్యోక్ నది నుంచి వెళ్తూ చైనా సరిహద్దు నియంత్రణ రేఖకు అనుసంధానంగా ఉండే బెగ్ ఓల్డీ సెక్టార్‌ను కలుపుతుంది. ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌సింగ్ ట్విటర్ ద్వారా పేర్కొంటూ.. ‘పర్యాటకంగా లద్ధాఖ్‌లో మంచి ప్రదేశాలు ఉన్నాయి. పర్యాటకులు అధిక సంఖ్యలో వచ్చేలా మార్గాలు సైతం లద్ధాఖ్‌లో ఉన్నాయి. పర్యాటకుల కోసం సియాచిన్ బేస్ క్యాంప్ నుంచి కుమార్ పోస్ట్ వరకు మార్గాలను తెరిచాం’ అని తెలిపారు.
భారత సైన్యం 1970 నుంచి సియాచిన్‌కు పర్యాటకులను అనుమతించి మళ్లీ 1984లో నిలిపివేసింది. 1984లో భారత్, పాక్‌ల మధ్య ఇక్కడ ఘర్షణలు జరిగాయి. అక్టోబర్ 31 నుంచి లద్ధాఖ్ కేంద్ర పాలిత ప్రాంతంగా అవతరించనున్న క్రమంలో సియాచిన్ ప్రారంభం కావడం విశేషం. ఇప్పటికే ఈ ఏడాది జూన్‌లో రాజ్‌నాథ్‌సింగ్ సైనికాధిపతి రావత్‌తో కలిసి సియాచిన్ వెళ్లి సైనికులతో మాట్లాడారు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.





