
ప్రపంచ దేశాల దృష్టి భారత్‌పై ఉంది. ఈ సారి సరిహద్దు ఎలా దాటుతుందో చూద్దాం అనుకున్న పాకిస్థాన్.. పీవోకేలో మళ్లీ టెర్రర్ క్యాంప్‌లను ఏర్పాటు చేసింది. వందల మంది ముష్కర మూకలను పోగేసి శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టింది. దీనిని గమనించిన భారత్ కొన్ని రోజుల క్రితమే పాక్‌ను హెచ్చరించింది. ఈ హెచ్చరికలను పాక్ ఏ మాత్రం ఖాతరు చేయలేదు. శనివారం హఠాత్తుగా పాక్ భారీగా శతఘ్నులతో కాల్పులు మొదలుపెట్టింది. ముష్కరులు కశ్మీర్‌లో చొరబడేందుకు అనువైన వాతావరణం సృష్టించేలా పాక్ ప్రయత్నిస్తోందని భారత్‌కు వెంటనే అర్థమైంది. అదే సమయంలో తంగ్దార్ సెక్టార్‌లో శనివారం పాక్ జరిపిన కాల్పుల్లో భారత్‌కు చెందిన ఇద్దరు సైనికులు, ఒక పౌరుడు మరణించారు. మరో ముగ్గురు పౌరులు గాయపడ్డారు. ఇళ్లు, పశువుల పాకలు సహా పలు ఆస్తులు ధ్వంసమయ్యాయి. దీంతో ఇక ఉపేక్షించకూడదని భావించిన సైన్యం శతఘ్నులను రంగంలోకి దించింది. తంగ్దార్ సెక్టార్‌కు ఎదురుగా పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని నీలం లోయలో జురా, అథ్‌ముకమ్, కుందల్‌షాహి, లిపా లోయలో ఉగ్రవాదులకు చెందిన నాలుగు స్థావరాలున్నట్లు భారత్ గుర్తించింది. ఒక్కో స్థావరంలో 10-15 మంది ఉగ్రవాదులు పాగా వేసినట్లు పసిగట్టింది. పక్కా సమాచారంతో లక్ష్యాలను గుర్తించి శతఘ్నులను గురిపెట్టి గుండ్ల వర్షం కురిపించింది. ఫలితంగా 20 మంది ఉగ్రవాదులు, 10 మంది పాక్ సైనికులను పరలోకాలకు పంపించింది.
లక్ష్యాలను అంత కచ్చితంగా ఎలా ఛేదించింది..?
సాధారణంగా శతఘ్నులతో దాడి చేసినప్పుడు.. లక్ష్యాలు గురితప్పితే చుట్టుపక్కల భారీగా నష్టం వాటిల్లుతుంది. పాక్ సైన్యం కూడా జనావాసాల మధ్యలో నక్కి భారత సైన్యంపై దాడులు చేస్తుంటుంది. ఈ క్రమంలో సాధారణ పౌరులు మరణిస్తే దానికి భారత్ దాడే కారణమని ప్రచారం చేస్తుంది. ప్రస్తుతం ఉన్న ఉగ్రస్థావరాల చుట్టుపక్కల కూడా సాధారణ ప్రజలు ఉండే అవకాశం ఉండటంతో భారత్ అప్రమత్తమై ఈ దాడికి శాటిలైట్ గైడెడ్ శతఘ్ని గుండ్లను ఉపయోగించినట్లు సమాచారం. అంతర్జాతీయ మీడియా ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ గుండ్లు నిర్దేశించిన లక్ష్యాలు తప్పడం చాలా అరుదు.. ఒక వేళ తప్పినా ఆ తేడా రెండు మీటర్లకు మించి ఉండదు. దీంతో ఈ సారి భారత్ శత్రుదేశంలో అడుగు పెట్టకుండానే ఉగ్రస్థావరాలపై విరుచుకుపడింది.
ఏమిటీ శాటిలైట్ గైడెడ్ షెల్స్..
అమెరికాలోని రేథియాన్-ఎంఎన్‌సీ బీఏఈ సంస్థలు ఎం 982 పేరుతో శతఘ్ని గుండ్లను అభివృద్ధి చేశాయి. 155 ఎంఎం శాటిలైట్ గైడెడ్ ఆర్టలరీ రౌండ్స్‌లో లక్ష్యాలను మార్చుకునే సౌకర్యం కూడా ఉంటుంది. నిర్దేశించిన లక్ష్యంపై కచ్చితంగా పడేలా జీపీఎస్ వ్యవస్థ దీనికి మార్గనిర్దేశం చేస్తుంది. రేథియాన్‌కు క్షిపణులు, డ్రోన్ల తయారీలో మంచి అనుభవం ఉంది. ఫిబ్రవరిలో పాక్‌తో ఉద్రిక్తత పెరగడంతో భారత్ అత్యవసర కొనుగోళ్లలో భాగంగా ఈ గుండ్లను తెప్పించింది. వాస్తవానికి కీలకమైన ఉగ్రవాద ఆపరేషన్లలో సొంత దళాలు కూడా లక్షిత ప్రదేశానికి దగ్గర్లోనే ఉండే అవకాశాలు ఉంటాయి. అలాంటప్పుడు లక్ష్యానికి 150 మీటర్ల అవతల ఉన్న బలగాలకు ఏమీ కాకుండా దాడి చేసేలా ఈ శతఘ్ని గుండ్లను రూపొందించారు. వీటిని తేలికపాటి ఎం-777 హోవిట్జర్లలో వాడవచ్చు. దాదాపు 57 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఇవి అత్యంత కచ్చితత్వంతో ఛేదిస్తాయి. దీంతోపాటు దక్షిణ కొరియా తయారు చేసిన కె-9 ట్రాక్డ్ హోవిట్జర్లలో కూడా వాడుకునే అవకాశం ఉంది. ఈ శతఘ్నులను భారత్ 2017లో కొనుగోలు చేసింది. అమెరికా ఈ గుండ్లను అఫ్గానిస్థాన్, ఇరాక్ యుద్ధాల్లో విజయవంతంగా వాడింది. కెనడా, ఆస్ట్రేలియా, స్వీడన్ వంటి దేశాలు ఇప్పటికే వీటిని కొనుగోలు చేశాయి. మరోపక్క భారత్ 145 ఎం777 హోవిట్జర్లను కొనుగోలు చేసే ఒప్పందంపై సంతకాలు కూడా చేసింది.
భారత్ చేరిన కొన్ని రోజుల్లోనే పాక్‌కు జవాబు..
ఈ గుండ్లు ఇటీవలే భారత్‌కు వచ్చినట్లు ఆంగ్ల వార్తా సంస్థ పీటీఐ వెల్లడించింది. బుధవారమే వీటికి సంబంధించి దిల్లీలో సైన్యం కీలక సమావేశం కూడా నిర్వహించింది.
Source : Enadu
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.





