ArticlesNews

భారత సంస్కృతి, సంప్ర‌దాయాల కాశీ తమిళ సంగమం 3.0

214views

కాశీ తమిళ సంగమం ఈ సంవత్సరం ఈ సాంస్కృతిక కార్యక్రమం యొక్క మూడవ ఎడిషన్ 3.0 ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఫిబ్రవరి 15 నుంచి 24 వరకు జరుగుతుంది. కాశీ తమిళ సంగమం 3.0 ప్రత్యేకమైన సాంస్కృతిక సంగమం, దేశంలోని రెండు అత్యంత పురాతనమైన అలాగే ఆధ్యాత్మికంగా గొప్ప ప్రాంతాలైన కాశీ- తమిళనాడులను ఒకచోట చేర్చి, భౌగోళిక స్వరూపాన్ని మించిన గొప్ప సాంస్కృతిక బంధాన్ని తెలియజేస్తుంది. కాశీ తమిళ సంగమం 3.0 2025 భారతదేశ భిన్నత్వంలో ఏకత్వానికి మరో నిదర్శనం.

కాశీ-తమిళ అనుసంధానం ఒక పవిత్ర అనుభంద పరంపర. శతాబ్దాలుగా, తమిళ ఋషులు, సాధువులు, పండితులు కాశీకి ప్రయాణించి, ఆధ్యాత్మిక, విద్యా దృశ్యాన్ని సుసంపన్నం చేశారు. తమిళ సమాజం కాశీని ఒక పవిత్ర స్థలంగా గౌరవించింది. మహాకవి సుబ్రమణ్య భారతియార్ వంటి వారు, కాశీలో తమిళ సాంస్కృతిక ముద్ర వేశారు . కాశీలోని హనుమాన్ ఘాట్ ఒడ్డున ఉన్న గొప్ప తమిళ సాహిత్య వ్యక్తులలో ఒకరైన మహాకవి భారతియార్ నివాసం ఒక తీర్థయాత్ర స్థలం. కాశీ-తమిళనాడు అనుసంధానం శతాబ్దాల నాటి బంధం. తమిళ సాధువు కుమారగురుపర దేశికర్ 17వ శతాబ్దంలో హనుమాన్ ఘాట్ వద్ద కుమారస్వామి మఠాన్ని స్థాపించి, కాశీలో తమిళ సంస్కృతికి జీవం పోశారు.

ఫిబ్రవరి 15న ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో కాశీ తమిళ సంగమం 3.0 ఘనంగా ప్రారంభమైంది . వివిధ మంత్రిత్వ శాఖలు, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి విద్యా మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఈ ప్రతిష్టాత్మక సాంస్కృతిక కార్యక్రమం, తమిళనాడు – కాశీ మధ్య పురాతన నాగరికత బంధాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. రెండు ప్రాంతాల నుండి పండితులు, విద్యార్థులు, తత్వవేత్తలు, వ్యాపారులు, చేతివృత్తులవారు, కళాకారులు ఇతర రంగాల ప్రజలు కలిసి రావడానికి, వారి జ్ఞానం, సంస్కృతిలో ఉత్తమ అభ్యాసాలను పంచుకోవడానికి ఒకరి అనుభవాన్ని మరొకరు నేర్చుకోవడానికి కాశీ తమిళ సంగమం ఎంతగానో దోహదపడుతుంది . అలాగే కాశీ, దాని పురాతన విద్యా సంస్థల చారిత్రక ప్రాముఖ్యతను అన్వేషించడానికి తమిళ విద్యార్థులకు ఒక వేదికను అందిస్తుంది. వివిధ కేంద్రీయ విశ్వవిద్యాలయాలలో చదువుతున్న తమిళ మూలాలు కలిగిన సుమారు 200 మంది విద్యార్థుల బృందం ఈ కార్యక్రమంలో పాల్గొంటుంది. కాశీ – తమిళనాడు మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేయడానికి ఈ సంవత్సరం అన్ని విభాగాలలో యువతను భాగస్వామ్యం చేశారు.

కాశీ తమిళ సంగమం ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా కేంద్ర విద్య శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ, కాశీ తమిళ సంగమం కార్యక్రమం దేశంలో అత్యంత గౌరవనీయమైన ఋషులలో ఒకరైన అగస్త్య మహర్షిని స్మరించుకుంటుందని తెలిపారు. అగస్త్య మహర్షి మేధో నైపుణ్యం, తమిళ భాష, సాహిత్యం, ఉమ్మడి విలువలు, సాంస్కృతిక సంప్రదాయాలు, వారసత్వానికి పునాదిగా పనిచేస్తుంది తెలిపారు.

ఈ సంవత్సరం కాశీ తమిళ సంగమంలో ప్రధాన ఇతివృత్తం సిద్ధ వైద్య విధానం (భారతీయ చికిత్స), శాస్త్రీయ తమిళ సాహిత్యం, దేశ సాంస్కృతిక ఐక్యతకు అగస్త్య మహర్షి చేసిన కృషిని తెలియజేస్తున్నారు. అదనంగా, ఆరోగ్యం, తత్వశాస్త్రం, సైన్స్, భాషాశాస్త్రం, రాజకీయాలు, కళలతో సహా వివిధ రంగాలకు ఆయన చేసిన అసమానమైన కృషికి అగస్త్య మహర్షి ప్రసిద్ధి చెందారు. తమిళ భాష మొదటి వ్యాకరణవేత్తగా అగస్త్య మహర్షి గౌరవించబడ్డారు. భారతీయ సంస్కృతిని ప్రచారం చేయడంలో అగస్త్య మహర్షి పాత్రకు జావా, సుమిత్రా ద్వీపాలలో కూడా ఆయనను పూజిస్తారు కాబట్టి, ఆయన ప్రభావం భారతదేశం దాటి విస్తరించింది. కాశీ తమిళ సంగమం 3.0 సందర్భంగా కాశీలో అగస్త్య మహర్షికి అంకితం చేస్తూ ఒక ప్రదర్శన నిర్వహించనున్నారు. ఈ ప్రదర్శనలో ఆయన జీవితానకి సంబంధించన అనేక అంశాలను, తమిళ భారతీయ జ్ఞాన సంప్రదాయాలకు ఆయన చేసిన కృషిని ప్రదర్శించనున్నారు.

కాశీ తమిళ సంగమం 3.0 ప్రారంభ రోజున ఫిబ్రవరి 15న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా స్పందిచారు.. కాశీ , తమిళనాడు మధ్య అనాది నాగరికత బంధాల వేడుకగా, ఈ వేదిక శతాబ్దాలుగా వర్ధిల్లిన ఆధ్యాత్మిక, సాంస్కృతిక , చారిత్రక సంబంధాలను ఒకచోట చేర్చుతుందన్నారు . ఇది ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ స్ఫూర్తిని చాటుతుందని కొనియాడారు. అందరు తప్పకుండా కాశీ తమిళ సంగమం 2025లో భాగం కావాలని ప్రధాని ఆక్షాంక్షించారు.