ArticlesNews

వనవాసీ వీరుడు తొలి స్వాతంత్ర్య సమరయోధుడు “తిల్కా మాంఝీ”

329views

( ఫిబ్రవరి 11 – తిల్కా మాంఝీ జయంతి )

సిపాయిల తిరుగుబాటు. ఇది 1857లో జరిగింది. దీన్నే మన చరిత్రకారులు భారతదేశ మొదటి స్వాతంత్ర్యం పోరాటంగా చెబుతారు. వాస్తవానికి అంతకంటే ఎన్నో ఏళ్లకు ముందే బ్రిటిన్ పాలనపై ఎందరో మహానుభావులు తిరుగుబాటు ప్రకటించారు. మాతృదేశం కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారు. అలా బ్రిటిష్ దుష్టపాలనను ఎదిరించి, తిరుగుబాటు చేసి వీర మరణం పొందిన ధన్యజీవే తిల్కా మాంఝీ. 18వ శతాబ్దంలో ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా జరిగిన సాయుధ పోరాటంలో తిల్కా మాంఝీ ఒక అప్రతిహత వీరుడు. తిల్కా మాంఝీ నేతృత్వంలోని తిరుగుబాటు విదేశీ పాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి స్వాతంత్ర్య యుద్ధం అనే చెప్పాలి.

తిల్కా మాంఝీ 1750వ సంవత్సరం ఫిబ్రవరి 11న బిహార్‌లోని సుల్తాన్‌గంజ్ తాలూకా తిల్కాపూర్ గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి పేరు సుందర ముర్ము. చిన్నప్పటి నుంచి తిల్కా అటవీ నాగరికత నీడిలో నివసించేవాడు. ప్రకృతితో మమేకమై జీవనం కారణంగా అతడికి ధైర్యం, నిర్భయం అనే గుణాలు సహజంగానే అలవడ్డాయి. తిల్కాకు పసితనం నుంచే ప్రకృతిని ఆరాధించే లక్షణం ఉంది. ముఖ్యంగా అతడు సంతాలు తెగకు చెందిన వాడు కావడం వల్ల అడవిలోని చెట్టూ పుట్టతో తిల్కాకు అన్యోన్య సంబంధం ఉండేది. సంతాలులు ముఖ్యంగా పోడు వ్యవసాయం మీద ఆధారపడి అటవీ ఉత్పత్తుల్ని సేకరించి అమ్ముకొని జీవించేవాళ్లు. ఇక అప్పటికే భారతదేశంలో బలపడి అన్ని విధాలుగా దోసుకుంటున్న ఈస్ట్ ఇండియా కంపెనీ దృష్టి సంతాలుల మీద, వారి పోడు వ్యవసాయ భూముల మీద పడింది. బ్రిటిషర్ల ఆగడాలతో వనవాసీలు తమ సొంతభూముల్లోనే సేవకులుగా మారారు. ఎదిరించిన సంతాలులను కాల్చి చంపడం, ఆడపడుచులపై అకృత్యాలు నిత్యకృత్యంగా మారాయి.

తిల్కా మాంఝీ తన చిన్నతనం నుంచే తమ తెగ పై జరగుతున్న అన్యాయాల్ని కళ్లారా చూశాడు. దీంతో తనకు 20 ఏళ్ల వయసు రాగానే ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా 1770లో ఉద్యమానికి పిలుపునిచ్చాడు. అదే సమయంలో బెంగాల్ ఘోర కరువు సుమారు కోటి మందిని పొట్టన బెట్టుకుంది. ఆ సమయంలో ఆదుకోవాల్సిన ప్రభుత్వం దీనికి భిన్నంగా వనవాసీలపై శిస్తుని పెంచింది. ఇది సహించలేని తిల్కా మాంఝీ బ్రిటిషర్లపై సమరసంఖం పూరించాడు. బ్రిటిషర్లకు చెందిన భాగల్‌పుర్ కోశాగారాన్ని దోచుకొని ఆ సంపదను కరవుతో అల్లాడుతున్న గిరిజనులకు, భూమి కోల్పోయిన నిరుపేద రైతులకు పంచాడు. తిల్కాపై ఆగ్రహించిన బెంగాల్ గవర్నర్ అతడిని పట్టుకోవడం కోసం కెప్టెన్ బ్రూక్ నేతృత్వంలో 8వందల మందితో కూడిన సాయుధ దళాన్ని పంపాడు. కానీ తిల్కాను పట్టుకోవడంలో వాళ్లు విఫలం అయ్యారు. పోరాట తీవ్రత గమనించిన బ్రటిషర్లు ఆదివాసీలలో విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నించారు. ఇది పసిగట్టిన తిల్కా సంతాలులనే కాక వనవాసీలందరినీ ఏకత్రాటిపైకి తెచ్చి పోరాటాన్ని కొనసాగించాడు.

బ్రిటిషర్లపై తిల్కా నేతృత్వంలోన వనవాసీలు ఆధిపత్యం ప్రదర్శించడం ప్రారంభించారు. అడవి లోయలు, తెరాయి, గంగా, బ్రాహ్మి నదులు, ముంగేర్, భాగల్పూర్, సంతల్, పరగణాల పర్వత ప్రాంతాల్లో తిల్కా మాంఝీ తన స్వదేశీ ఆయుధ సైన్యంతో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా నిరంతరం గెరిల్లా పోరాటం చేశాడు. 1784లో భాగల్పూర్ వేదికగా బ్రిటిషర్లపై చేసిన యుద్ధంలో ఎస్పీ స్థాయి అధికారి క్లీవ్‌లాండ్‌ను తుదముట్టించాడు. క్లీవ్‌లాండ్ మరణం బ్రిటిషర్ల గుండెల్లో వణుకు పుట్టించింది. దీంతో వారు కుట్రకు తెరతీశారు. తిల్కా అనుచరుల్లో ఒకరిని కోవర్ట్‌గా చేసుకున్నారు. ద్రోహి ఇచ్చిన సమాచారంతో లెఫ్టినెంట్ జనరల్ ఐర్‌కూట్ బృందం తిల్కా సేనపై దాడి చేసింది. ఈ దాడి నుంచి తిల్కా చాకచక్యంగా తప్పించుకున్నా అధిక సంఖ్యలో తన అనుచరులను పోగొట్టుకున్నాడు. సుల్తాన్‌గంజ్ అడవుల్లో తలదాచుకుంటూ తిల్కా మాంఝీ గెరిల్లా యుద్ధ రీతుల్లో బ్రిటిష్ దళాలతో యుద్ధం కొనసాగించాడు. ఈ ప్రాంతాన్ని బ్రిటిషర్లు నలువైపులా ముట్టడించి తిల్కా సేనకు ఆహారపానీయాలు అందకుండా చేశారు. అయినా కూడా వీరోచితంగా పోరాడిన ఈ వనవాసీ పోరాట యోధుడు చివరికి 1785 జనవరి 13న బ్రిటిషర్లకు పట్టుబడ్డాడు. వాళ్లు ఈ వనవాసీ స్వాతంత్ర్య సమరయోధుడిని పట్టుకొని అతడి చేతులను తాళ్లతో గుర్రాలకు కట్టి 31 కిలోమీటర్లు సుల్తాన్‌గంజ్ అడవుల నుంచి భాగల్‌పూర్ వరకు ఈడ్చుకు వచ్చారు. అనంతరం అతడిని మర్రిచెట్టుకు వేలాడదీసి ఉరి తీశారు.

తిల్కా మాంఝీని ఉరి తీసే సమయానికి అతడికి కేవలం 35 ఏళ్లు మాత్రమే. భారతదేశాన్ని బానిసత్వం నుండి విడిపించడానికి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన మొదటి వ్యక్తి తిల్కా మాంఝీ. అతడి బలిదానం తర్వాత 1857లో స్వాతంత్ర్య పోరాటం తిరిగి ప్రారంభం అయింది. తిల్కా జ్ఞాపకార్థం భాగల్పూర్ ఆస్థానంలో ఆయన విగ్రహాన్ని నెలకొల్పారు. అతని పేరు మీద ఓ విశ్వవిద్యాలయం కూడా ఉంది. తిల్కా ఎల్లప్పుడూ భారతమాత కుమారుడిగా ఎప్పటికీ గుర్తుండిపోతారు.