
విభజన శక్తులు భారత్ ను విచ్ఛిన్నం చేయడానికి రోజు రోజుకీ కొత్త కొత్త కథనాలను రూపొందిస్తున్నాయని ప్రజ్ఞా ప్రవాహ్ అఖిల భారతీయ సంయోజక్ నందకుమార్ అన్నారు. విచ్ఛిన్నం చేయడానికి వారు టూల్ కిట్ లను సృష్టించారని, తప్పుడు కథనాలను ప్రచారం చేయడానికి ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోరన్నారు. కేరళలో జరుగుతున్న మవేలీకర అంతర్జాతీయ పుస్తక ప్రదర్శనలో ‘‘నూతన కథనాలు – కేరళ’’ అనే అంశంపై ప్రసంగించారు. అలాగే ప్రపంచ మార్కెట్ శక్తులతో కలిసి, కొత్త మద్దతుదారులతో కలిసి హానికరమైన సంస్కృతిని పరిచయం చేశారన్నారు.
మొదటగా వారు సంస్కృతి, సంప్రదాయాలను నాశనం చేయడానికి ప్రయత్నాలు చేస్తారని, ఆ దిశగానే విభజన శక్తులతో భారత్ ను విచ్ఛిన్నం చేసేందుకు కొత్త కథనాలను రూపొందిస్తున్నారని పేర్కొన్నారు.‘‘కటింగ్ సౌత్’’ వంటి ఉద్యమాలకు సంబంధించిన వ్యక్తులు ముఖ్యంగా కేరళలోనే ఇలాంటి కథనాలను ప్రోత్సహిస్తారని అన్నారు. కన్యాకుమారి నుంచి హిమాలయాల వరకు ఒకే జాతి అన్న సిద్ధాంతాన్ని ఇక్కడి ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారని పేర్కొన్నారు. ‘‘కట్టింగ్ సౌత్’’ అనేది కూడా విచ్ఛిన్నకరమైన శక్తుల పనేనని, ఇలాంటి కొత్త కొత్త కథనాలను సృష్టిస్తున్నారని వివరించారు.
అంతేకాకుండా ఈ మధ్య నారాయణ గురు సనాతన ధర్మాన్ని విశ్వసించరన్న కొత్త, తప్పుడు వాదాన్ని తెరపైకి తెచ్చారని, ఈ కథన సృష్టిలో సాక్షాత్తూ కేరళ సీఎం పినరయ్ వున్నారన్నారు. అయినా… వారికి సనాతన ధర్మం అంటే ఏమిటో తెలియదని, అందుకే ఇలా పదే పదే చెబుతుంటారన్నారు. నారాయణ గురు సనాతన ధర్మ ప్రతిపాదకులని, సనాతన ధర్మం నాలుగు గోడలకే పరిమితం కాదని, అందర్నీ దగ్గరికి తీసుకుంటుందన్నారు. అంతేకాకుండా సన్యాసాశ్రమంలో వున్న వారు ఏ ఒక్క మతానికో పరిమితం కాదని వివరించారు.
దేశాన్ని కలిపి వుంచే శక్తి సనాతన ధర్మానికి వుందని, స్థిరమైన పురోగతి అన్న సంప్రదాయంపై వుంటుందన్నారు. అలాగే ఏ దుష్ట శక్తులూ సనాతన ధర్మాన్ని ఆపలేరని, నాశనమూ చేయలేరని ధీమా వ్యక్తం చేశారు. విచ్ఛిన్నకర శక్తులు తెరపైకి తెచ్చే కొత్త కొత్త కథనాలకు విదేశాల నుంచి వారికి ఆర్థిక ప్రోత్సాహం లభిస్తుందని, సంస్కృతి, సంప్రదాయాలను అణచివేయడానికి వారు నిరంతర ప్రయత్నాలు చేస్తూనే వుంటారని ,అందరూ జాగరూకతతో వుండాలని నంద కుమార్ పిలుపునిచ్చారు. శక్తిమంతమైన దేశాలను అస్థిరపరచడం, తద్వారా తమ ప్రభావాన్ని పెంచుకోవడమే వారి లక్ష్యమని నంద కుమార్ అన్నారు.





