
రెండు వేల రూపాయల నోట్ల ముద్రణను ఆర్‌బీఐ నిలిపివేసింది. భారతీయ రిజర్వ్ బ్యాంకు నోట్ ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక్క రూ.2000 నోటునూ ముద్రించలేదని ఆర్బీఐ తాజాగా వెల్లడించింది. ఓ వార్తా ప్రసార సంస్థ అడిగిన ప్రశ్నకు సమాచార హక్కు చట్టం కింద ఈ వివరాలను ఆర్‌బీఐ వెల్లడించింది.
దేశంలో నల్లధన ప్రవాహాన్ని అరికట్టడమే లక్ష్యంగా 2016 నవంబర్‌లో కేంద్ర ప్రభుత్వం పాత రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే కొత్తగా రూ.2000 నోట్లు అనంతరం రూ.500 నోట్లను చలామణీలోకి తీసుకొచ్చింది. కాగా 2016-17 ఆర్థిక సంవత్సరంలో 3,542.991 మిలియన్ల రూ.2000 నోట్లను ముద్రించినట్టు ఆర్‌బీఐ వెల్లడించింది. అప్పట్నుంచి క్రమంగా ఆ నోట్ల ముద్రణను తగ్గించుకుంటూ వస్తోంది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో 111.507 మిలియన్ నోట్లను ముద్రించగా.. 2018-19 ఆర్థిక సంవత్సరంలో కేవలం 46.690 మిలియన్ల రెండువేల రూపాయల నోట్లను మాత్రమే ఆర్బీఐ ముద్రించింది.
అధిక విలువ కల్గిన నోట్ల చలామణీని తగ్గించడం ద్వారా నల్లధన ప్రవాహానికి అడ్డుకట్ట వేయవచ్చని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు, రూ.2వేల నోట్ల అధిక ప్రవాహంతో అవినీతి కార్యకలాపాలు నియంత్రించాలనే ప్రభుత్వ లక్ష్యాలకు విఘాతం ఏర్పడుతోందని అధికారులు పేర్కొంటున్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్- తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో లెక్కల్లో చూపని రూ.6కోట్ల విలువ చేసే రూ.2వేల నోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అధిక నాణ్యతతో ఉన్న రూ.2000 నోట్లకు నకిలీ నోట్లను పాక్ కేంద్రంగా ముద్రిస్తున్నట్టు నిఘావర్గాలు తెలిపాయి. గత మూడేళ్లలో రూ.50కోట్లకు పైగా నకిలీ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్టు ఈ ఏడాది జూన్‌లో ప్రభుత్వం వెల్లడించింది.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.





