News

గ్రామాలకు సైతం పాకుతున్న విదేశీ విష సంస్కృతి

561views

రాజధాని ప్రాంత యువత మత్తులో జోగుతోంది. పబ్బులు క్లబ్బుల కల్చర్ విజయవాడ లాంటి మహానగరాలను దాటి నూతన రాజధాని ప్రాంతంగా గుర్తింపు పొంది అభివృద్ధి చెందుతున్న మంగళగిరి, తాడేపల్లి వంటి చిన్న నగరాలు, గ్రామీణ ప్రాంతాలకు కూడా పాకింది. ఆధునికత పేరుతో యువతీ యువకులు నడిరోడ్డుపై అర్ధనగ్నంగా తిరుగుతూ ఎక్కడపడితే అక్కడ మద్యం సేవిస్తూ నానా హంగామా చేస్తున్నారు. బైకు రేసుల పేరుతో రహదారులపై అలవికాని వేగంతో ద్విచక్ర వాహనాలను తోలుతూ ఇతర వాహనదారులను బెంబేలెత్తిస్తున్నారు. మండలాల్లోని వివిధ గ్రామాలలో యువత పుట్టినరోజు వేడుకల పేరుతో నడిరోడ్డుపై బర్త్ డే పార్టీలు జరుపుకుంటూ మందు తాగి చిందులేస్తున్నారు. అర్ధరాత్రి వరకు యువతీ యువకులు మద్యం మత్తులో నడిరోడ్డుపై తిరగడం, పెద్ద పెద్దగా కేకలు వేయడం, హారన్లు మోగించడం చేస్తూ అటువైపుగా వెళుతున్న ద్విచక్ర వాహనదారులను, ఇతరులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. బహిరంగంగా ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు.

ఈ మధ్య విజయవాడలో డ్రగ్స్‌ విక్రయ ముఠా గుట్టురట్టయింది. డ్రగ్స్‌ విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇద్దరు నైజీరియన్ల తోపాటు మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద హెరాయిన్‌, 200 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నైజీరియన్లు కేఎల్‌ యూనివర్సిటీలో విద్యార్థులు. ఇలా విద్యాలయాలలో వివిధ దేశాల, రాష్ట్రాల విద్యార్ధులుండడంతో వారి ద్వారా కూడా యువతలో విష సంస్కృతి నిండుతోంది. అలాగే కే ఎల్ యూనివర్సిటీ చుట్టు ప్రక్కల కూడా యువతీ యువకులు బైకులపై వేగంగా వెళుతూ, మద్యం సేవిస్తూ, అర్ధ నగ్న దుస్తులతో ఇలా రక రకాలుగా కనిపిస్తారు. అది కూడా గ్రామీణ ప్రాంతమే కావడం గమనార్హం.

దీని మూలాన ఈ విశృంఖలత్వం స్థానిక యువతకు కూడా అలవాటవుతోందని, యూనివర్సిటీలోనో, కలాశాలలోనో ఉండే తమ స్నేహితుల ప్రభావంతో స్థానిక యువత కూడా పెడదోవ పడుతోందని పోలీసు అధికారులు తెలుపుతున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలపై నిఘా వేసి ఉంచాలని, వారి కోసం సమయాన్ని వెచ్చించి, వారితో స్నేహంగా మసలి వారు చెడు స్నేహాల జోలికి పోకుండా వారిని తరచూ హెచ్చరిస్తూ ఉండాలని, డబ్బులు కూడా పరిమితంగానే వారికి అందుబాటులో ఉంచాలని పోలీసు వారు తల్లిదండ్రులను సైతం హెచ్చరిస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.