News

మహా కుంభమేళాకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. యాత్ర వివరాలు ఇలా..

296views

భక్తుల సౌకర్యార్థం ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు విజయవాడ నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నామని జిల్లా ప్రజారవాణాధికారి ఎం.వై దానం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ యాత్రలో ప్రయాగరాజ్‌తో పాటు అయోధ్య, కాశీ పుణ్యక్షేత్రాలను దర్శించుకొనే విధంగా రానుపోను సుమారు 3,600 కిలో మీటర్లు, మొత్తం 8 రోజుల ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు.

ఫిబ్రవరి 1 నుంచి 8 వరకు..
ఫిబ్రవరి ఒకటో తేదీన ఉదయం విజయవాడ పీఎన్‌బీఎస్‌ నుంచి బస్సులు బయలుదేరుతాయి.
2న సాయంత్రం ప్రయాగరాజ్‌ చేరుకుంటాయి.
3న ప్రయాగరాజ్‌లో బస.
4న రాత్రి నుంచి అయోధ్యకు ప్రయాణం.
5న ఉదయం అయోధ్య చేరుకుని బాల రాముడి దర్శనాంతరం రాత్రికి వారణాసికి ప్రయాణం.
6న వారణాసి చేరుకొని అక్కడే రాత్రికి బస.
7న ఉదయం వారణాసి నుంచి బయలుదేరుతారు.
8న బస్సులు విజయవాడకు చేరుకుంటాయి.

ఈ యాత్రలో పిల్లలు, పెద్దలకు ఒకటే ఛార్జీ ఉంటుందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఇవి కేవలం బస్సు ఛార్జీల వివరాలు మాత్రమేనని, భోజనం, వసతి ఖర్చులు వారే పెట్టుకోవాలని చెప్పారు. యాత్రకు వెళ్లదలచిన వారు 35, 29 మంది భక్తులు సమూహంగా వస్తే ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తామన్నారు. ముందస్తు రిజర్వేషన్‌ కోసం ఆన్‌లైన్, సమీప బస్‌ స్టేషన్, ఆర్టీసీ టికెట్‌ బుకింగ్‌ ఏజెంట్ల వద్ద టికెట్లు పొందవచ్చన్నారు. మరిన్ని వివరాలకు 80742 98487, 0866 2523926, 0866 2523928 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

ఇప్పటికే కొవ్వూరు, రాజమహేంద్రవరం డిపోల నుంచి బస్సులు ఏర్పాటు చేశామని, వాటిల్లో రిజర్వేషన్లు పూర్తయ్యాయని, ఇవి కూడా ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచే బయలుదేరుతాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు.

ఛార్జీల వివరాలు..
సూపర్‌ లగ్జరీ – రూ.8,000
స్టార్‌ లైనర్‌ నాన్‌ ఏసీ స్లీపర్‌ – రూ.11,000
వెన్నెల ఏసీ స్లీపర్‌ – రూ.14,500