
తెలుగు భాషలో డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల నిర్వహణకు మలేసియా తెలుగు సంఘం(టీఏఎం) హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంతో ఒప్పందం కుదుర్చుకుంది. గురువారం మలేసియాలోని రావాంగ్‌లో జరిగిన సమావేశంలో తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడు ఆచార్య నిత్యానందరావు, రిజిస్ట్రార్ ఆచార్య కోట్ల హనుమంతరావు, మలేసియా తెలుగు సంఘం అధ్యక్షుడు డా.వెంకటప్రతాప్, ఉపాధ్యక్షులు సత్తయ్య, సుధాకర్‌నాయుడు, సురేష్‌నాయుడు, గౌరవ సలహాదారు డాక్టర్ అచ్చయ్యకుమార్‌ల సమక్షంలో ఒప్పందం జరిగింది. ఈ సందర్భంగా ఆచార్య నిత్యానందరావు మాట్లాడుతూ.. తెలుగు భాష ఉనికి పోతే తెలుగుజాతి అస్తిత్వం కోల్పోతామనే ఆవేదనతో మలేసియాలో స్థిరపడ్డ తెలుగు ప్రజలు, భాషాభిమానులు చేసిన నిరంతర కృషి ఫలితమే ఈ కోర్సుల ప్రారంభానికి శ్రీకారమన్నారు. అచ్చయ్యకుమార్ మాట్లాడుతూ కౌలాలంపూర్ సమీపంలోని రావాంగ్ పట్టణంలో ఇక్కడి తెలుగువారి సహకారంతో తెలుగు సంస్కృతి, ఆచార వ్యవహారాలు ప్రతిబింబించేలా, తెలుగు అకాడమీ పేరుతో విశాల భవన సముదాయం నిర్మించామన్నారు. భావితరాలకు తెలుగు భాష నేర్పడం, తెలుగువారితో సత్సంబంధాలు పెంచుకోవడంలో తెలుగు వర్సిటీతో చేసుకున్న ఒప్పందం ఎంతో తోడ్పడుతుందన్నారు. వెంకటప్రతాప్ మాట్లాడుతూ.. తెలుగు భాష ఏడాది సర్టిఫికెట్ కోర్సుతో పాటు ఏకంగా నాలుగేళ్ల డిప్లొమా కోర్సును కూడా నిర్వహించడానికి ఒప్పందం చేసుకోవడం విశేషమన్నారు.





