
ఉత్తర్ ప్రదేశ్ లోని సంభల్ కోత్వాలి పోలీసుస్టేషన్ పరిధిలో ఉన్న కోట్ పూర్వీ వద్ద ఉన్న పురాతన ‘మృత్యు కూప్’ బావి పనరుద్ధరణ, తవ్వకం పనులను అధికారులు ప్రారంభించారు. మతపరమైన, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగి ఉన్న బావు లను గుర్తించి పునరుద్ధరించే చర్యల్లో భాగంగా ఈ పనులు చేపట్టారు. ఈ నిర్మాణం మొఘల్ కాలం నాటి షాహీ జామా మసీదుకు సమీపంలో ఉంది. అయితే పూర్వం ఈ స్థలంలో హరిహర ఆలయం ఉండేదని దాఖలైన పిటిషన్ పై స్థానిక కోర్టు సర్వేకు ఆదేశించింది. ఈ క్రమంలో గత నెలలో అధికారులు సర్వే చేపట్టగా ఆందోళనకారులు చెలరేగడంతో తీవ్ర హింసకు దారి తీసింది. నలుగురు మృతిచెందడంతోపాటు డిప్యూటీ కలెక్టర్ సహా పలువురు గాయపడ్డ విషయం విదితమే. కాగా ఈ బావికి చారిత్రక నేపథ్యం ఉండడంతోపాటు ఇందులో స్నానం చేస్తే మోక్షం లభిస్తుందని స్థానికులు విశ్వసిస్తారు. కానీ కొన్నాళ్లుగా చెత్తతో నిండిపోయి శిథి లావస్థకు చేరింది. సంభల్ ఆర్డీవో వందనా మిశ్రా మాట్లాడుతూ.. పురావస్తు శాఖ (ఏఎస్ఐ) బృందంతో కలిసి హౌస్ భద్దే సరామ్లోని భద్రికా ఆశ్రమ్హర్థ, చతుర్ముఖ్ కూప్(రాళ్లతో నిర్మించిన బావి)లను సందర్శించినట్లు తెలిపారు. తదుపరి అధ్యయనం తర్వాత తమ బృందం బావుల వయస్సును నిర్ణయించడంతో పాటు వాటి సంరక్షణ కోసం సిఫార్సులు చేస్తుందని చెప్పారు. ప్రస్తుతం మృత్యు కూప్ తవ్వకం జరుగు తోందని, దాని సంరక్షణకు తాము ఉత్తమమైన పద్ధ తులను మూల్యాంకనం చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు చారిత్రక ప్రాముఖ్యం కలిగిన 19 బావుల్లో 15 బావులను గుర్తించామని మిశ్రా తెలిపారు. ఈ బావి పునరుద్ధరణ సంభల్లో మతపరమైన పర్యాటక అవకాశాలను పెంచుతుందని అధికారులు భావిస్తున్నారు.





