
ప్రయాగ్‌రాజ్‌లో జరిగే మహా కుంభమేళా కోసం ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈక్రమంలో గంగానదిలో అండర్‌వాటర్ డ్రోన్‌ను అధికారులు పరీక్షించారు. ‘‘మహాకుంభ్‌ను విజయవంతం చేసేందుకు యూపీ ప్రభుత్వం కొత్త టెక్నాలజీని ఉపయోగిస్తోంది. తొలిసారిగా అండర్‌వాటర్‌డ్రోన్‌ను పరీక్షించాం. ఇది నీటి అడుగున ఉన్న వస్తువులను గుర్తించగలదు. ఎవరైనా నీళ్లలో మునిగిపోతే వెంటనే డైవర్ల సాయంతో ఆ ప్రాంతానికి చేరుకోవడానికి వీలుకలుగుతుంది’’ అని అధికారులు మీడియాకు వెల్లడించారు.
జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ఈ మహా కుంభమేళా కొనసాగనుంది. ప్రతి 12 సంవత్సరాలకు నిర్వహించే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా కోట్లాది మంది యాత్రికులు ప్రయాగ్‌రాజ్‌కు చేరుకుంటారు. ఈసారి దాదాపు 45కోట్ల మంది యాత్రికులు, సాధువులు, సన్యాసులు, పర్యటకులు రానున్నట్లు యూపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. ‘‘దీనిని స్వచ్ఛంగా, ఆరోగ్యంగా, సురక్షిత, డిజిటల్ కార్యక్రమంగా మార్చేందుకు యూపీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. గతంలో కంటే అద్భుతంగా జరుగుతుంది’’ అని యూపీ జల్‌శక్తి మంత్రి స్వతంత్ర దేవ్ సింగ్ ఇటీవల వెల్లడించారు.





