News

కబేళాకు పశువులు తరలిస్తున్న లారీల పట్టివేత

341views

తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా పెబ్బేరు నుంచి తమిళనాడులోని సేలం కబేళాకు పశువులు తరలిస్తున్న రెండు లారీలను అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట పోలీసులు పట్టుకున్నారు. ఏడుగురిపై జంతు హింస చట్టం కింద కేసు నమోదు చేశారు.

వివరాలు.. చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణానికి చెందిన మహమ్మద్ ఆరీఫ్ పశువుల క్రయ, విక్రయాల వ్యాపారం చేస్తున్నాడు. తెలంగాణలోని పెబ్బేరు పరిసర ప్రాంతాల్లో ఎద్దులను కొనుగోలు చేశాడు, ఒక లారీలో 35, మరో లారీలో 31 ఎద్దులను ఎక్కించాడు. అక్కడి నుంచి అనంతపురం మీదుగా మదనపల్లె జాతీయ రహదారిపై పశువుల అక్రమ రవాణా జరుగుతోందని భాజపా నాయకులు స్థానిక తహసీల్దారు మహమ్మద్ అన్సారీ, సీఐ జీవన్ గంగానాబ్బాబులకు సమాచారం ఇచ్చారు. రెవెన్యూ అధికారులు, పోలీసులు రంగంలోకి దిగి స్థానికుల సహకారంతో లారీలను అన్నమయ్య జిల్లా బి. కొత్తకోట మండలం పెద్దపల్లె క్రాస్ వద్ద పట్టుకున్నారు.

ఇద్దరు డ్రైవర్లతో పాటు నలుగురు కూలీలను అదుపు లోకి తీసుకుని పోలీసులు ప్రశ్నించగా పుంగనూరు సంతకు ఎద్దులను తీసుకెళ్తున్నట్లుగా సమాధానం ఇచ్చారు. అనంతరం లారీలను స్థానిక పోలీసు స్టేషన్ కు తరలించారు. పుంగనూరుకు చెందిన వ్యాపారి రూ.12 లక్షలకు ఎద్దులను కొనుగోలు చేసి అక్రమంగా తమిళనాడుకు తర లించి కబేళాకు విక్రయిస్తున్నట్లు పోలీసులు ప్రాధమికంగా నిర్ధారణకు వచ్చారు. బయ్యప్పగారిపల్లె వీఆర్వో, రవికుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిత్తూరుజిజిల్లా పెద్దపంజాణి మండలం రాయలపేటకు చెందిన షేక్. మహమ్మద్ మునాఫ్, సుబ్రహ్మణ్యం, ముబారక్, కృష్ణప్ప, మహబూబ్ బాషా, పలమనేరుకు చెందిన అక్బర్లతో పాటు ఎద్దుల వ్యాపారి మహమ్మద్ ఆరీఫ్ పై జంతు హింస కేసును నమోదు చేసినట్లు స్థానిక సీఐ జీవన్ గంగానాధ్ బాబు తెలిపారు.