
ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ)కు చెందిన నలుగురు సభ్యుల బృందం సంభల్‌లో ఇటీవల బయటపడిన కార్తీక్ మహాదేవ్ ఆలయంతోపాటు ఐదు తీర్థాలు, 19 పురాతన బావులపై సర్వే నిర్వహించింది. ఈ సర్వే మధ్యాహ్నం 3.30 వరకూ కొనసాగిందని సంభల్ జిల్లా కలెక్టర్ రాజేందర్ పెన్సియా పేర్కొన్నారు. దాదాపు 10 నుంచి 12 అడుగుల లోతు వరకూ తవ్వకాలు జరిపారు. తొలుత తలభాగం దెబ్బతిన్న స్థితిలోవున్న పార్వతీదేవి విగ్రహం, అనంతరం గణేశ, లక్ష్మీదేవి విగ్రహాలు తవ్వకాల్లో బయటపడ్డాయని కలెక్టర్ అన్నారు. విగ్రహాలు అక్కడికి ఎలా చేరాయన్న విషయంపై మరింత లోతుగా దర్యాప్తు జరుపుతామన్నారు. భస్మ శంకర ఆలయంగా కూడా ప్రసిద్ధమైన కార్తీక్ మహాదేవ్ ఆలయం దాదాపు 46 ఏళ్లుగా మూసివుంది. ఈ ఆలయాన్ని డిసెంబరు 13న తిరిగి తెరిచారు.
కబ్జాల నిర్మూలన కోసం యాంటీ ఎన్‌క్రోచ్‌మెంట్ డ్రైవ్ చేపట్టగా ఈ ఆలయం బయటపడిందని అధికారులు చెప్పారు. ఆలయంలో ఒక శివ లింగంతోపాటు హనుమంతుని విగ్రహం ఉన్నట్టు కనుగొన్నారు. ఆలయ ప్రాంగణంలోని బావిలో దెబ్బతిన్న స్థితిలోవున్న మూడు విగ్రహాలు కనుగొన్నట్టు అధికారులు గత సోమవారం ప్రకటించారు. సంభల్ లోని ఖగ్గు సరాయ్ ప్రాంతంలో ఉన్న షాహీ జామా మసీదుకు కిలోమీటరు దూరంలో ఈ ఆలయం ఉంది. ఒక కిందిస్థాయి కోర్టు సంభల్ జామియా మసీదులో సర్వేకు ఆదేశాలు జారీ చేయడంతో ఇటీవల పెనుదుమారం రేగిన విషయం విదితమే. ఆ సందర్భగా జరిగిన నిరసనలు, హింసాత్మక ఘటనల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులతో సహా పలువురు గాయపడ్డారు.





