News

వేద విద్యకు ప్రోత్సాహం

345views

రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి, హిందూ ధర్మ పరిరక్షణకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. నెల్లూరులో నూతనంగా నిర్మించిన దేవాదాయశాఖ సహాయ కమిషనర్‌ కార్యాలయాన్ని జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఎన్‌.ఎం.డి. ఫరూక్‌, మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణ,జడ్పీ చైర్మన్‌ ఆనం అరుణమ్మ లతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ,రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామన్నారు. త్వరలోనే 250 వేద పండితుల పోస్టులను భర్తీ చేస్తామన్నారు. గతంలో ధూపదీప నైవేద్యాలకు రూ.5వేలు ఇస్తుండగా దానిని ప్రస్తుతం రూ.10వేలకు పెంచామన్నారు. అర్చకులకు గతంలో రూ.10వేలు వేతనం ఇస్తుండగా తమ ప్రభుత్వం రూ.15వేలు ఇస్తున్నామన్నారు.వేద విద్యార్థులకు రూ.3వేల మేర సంభావన అందించి వేద విద్యను ప్రోత్సహిస్తున్నట్లు మంత్రి చెప్పారు. రాష్ట్రంలోని ఆలయాలకు చెందిన విలువైన ప్రభుత్వ భూములను పరీక్షించేందుకు చర్యలు చేపడుతున్నామని మంత్రి వెల్లడించారు.