
దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న దిల్లీ-కశ్మీర్ రైలు సర్వీసు ప్రాజెక్టు విషయంలో పెద్ద ముందడుగు పడింది. శ్రీ మాతా వైష్ణోదేవీ ఆలయ పర్వత పాదాల వద్ద కీలకమైన టి-33 సొరంగానికి సంబంధించిన తుది విడత పనులు పూర్తయ్యాయి. దీంతో కాట్రా, రియాసీ జిల్లాల మధ్య రైల్వే సంధానత ఏర్పడింది. ఇది చరిత్రాత్మక మైలురాయి అని రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ పేర్కొన్నారు. ‘‘ఉధంపుర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే లింక్‌కు సంబంధించిన తుదివిడత ట్రాక్ పనులు పూర్తయ్యాయి. 3.2 కిలోమీటర్ల పొడవైన టి-33 సొరంగ మార్గంలో కంకర రహిత ట్రాక్ పనులు శుక్రవారం విజయవంతంగా పూర్తయ్యాయి’’ అని ఆయన వెల్లడించారు.
దేశంలోని మిగతా ప్రాంతాల నుంచి కశ్మీర్‌కు నేరుగా రైళ్లను నడిపేందుకు ఉధంపుర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే లైన్ (యూఎస్‌బీఆర్‌ఎల్)ను రైల్వేశాఖ చేపట్టింది. ఈ ప్రాజెక్టు సాకారానికి టి-33 సొరంగ మార్గమే తుది అడ్డంకి. అందులో ప్రధానమైన ట్రాక్ పని పూర్తయింది. చిన్నచిన్న పనులు మాత్రమే మిగిలున్నాయి. అవి కూడా ఈ నెల 20 నాటికి పూర్తవుతాయని రైల్వే అధికారులు చెబుతున్నారు. దీంతో కశ్మీర్ లోయకు రైలు మార్గం సిద్ధమవుతుంది. డిసెంబరు 20 తర్వాత నుంచి ఈ రైల్వే లైన్‌లో ప్రయోగాత్మకంగా రైళ్లను నడుపుతామని అధికారులు తెలిపారు. అంతా అనుకున్నట్లే జరిగితే జనవరి చివరినాటికి కశ్మీర్ లోయకు పూర్తిస్థాయిలో రైలుమార్గం సిద్ధమవుతుందన్నారు. వచ్చే నెల 26న ఈ మార్గంలో వందేభారత్ రైలు నడుస్తుందని చెప్పారు. తద్వారా దిల్లీ నుంచి కశ్మీర్ లోయకు చేరే తొలి రైలుగా చరిత్ర సృష్టిస్తుందని, అక్కడి ప్రజల కల నెరవేరుతుందని తెలిపారు.
- 2014లో రియాసీ జిల్లాలో రైలు సర్వీసు అందుబాటులోకి వచ్చింది. అంతకుముందు 2005లో ఉధంపుర్‌తో సంధానత ఏర్పడింది. 1972లో పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌తో జమ్మూకు రైలు మార్గం ఏర్పడింది.
- ప్రస్తుతం కశ్మీర్ లోయలో బారాముల్లా నుంచి ఖ్వాజీగండ్ వరకూ, ఆ వెలుపలికి లోకల్ రైళ్లు నడుస్తున్నాయి. రామ్‌బన్ జిల్లాలోని సంగల్‌దాన్ ప్రాంతం వరకూ లోకల్ రైలు సర్వీసు అందుబాటులో ఉంది.
ఇవీ విశేషాలు..
దిల్లీ-కశ్మీర్ రైలు మార్గంలో 38 సొరంగాలు ఉంటాయి. మొత్తం మీద 119 కిలోమీటర్ల పాటు సొరంగ మార్గంలో రైళ్లు నడుస్తాయి.
- వీటిలో టి-49.. దేశంలోనే అత్యంత పొడవైన సొరంగం. దీని పొడవు 12.75 కిలోమీటర్లు.
- ఈ మార్గంలో 927 వంతెనలు ఉంటాయి. అందులో చీనాబ్ వంతెన కూడా ఉంది. దీని ఎత్తు 359 మీటర్లు. పారిస్‌లోని ప్రఖ్యాత ఐఫిల్ టవర్‌తో పోలిస్తే దీని ఎత్తు 35 మీటర్లు ఎక్కువ కావడం విశేషం.





