
వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి ఆలయంలో జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనాలకు అనుమతిస్తామని తితిదే శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యమిస్తూ తితిదే పలు నిర్ణయాలు తీసుకుంది. టోకెన్లు లేని భక్తులను తిరుమలకు అనుమతించినా దర్శనం చేసుకునే అవకాశం లేదు. గోవిందమాల భక్తులకు ఎలాంటి ప్రత్యేక దర్శనాలు ఉండవు. చంటిబిడ్డలు, వృద్ధులు, దివ్యాంగులు, రక్షణ శాఖ, ఎన్‌ఆర్‌ఐ తదితరులకు కల్పించే విశేష దర్శనాలను రద్దు చేశారు. ప్రొటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు లేవు. మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ బ్యూరోక్రాట్లు, మాజీ ఛైర్మన్లకు వైకుంఠ ఏకాదశి రోజున దర్శనానికి అనుమతి ఉండదు. భారీ క్యూలైన్లు నివారించి గరిష్ఠ సంఖ్యలో భక్తులకు వైకుంఠద్వార దర్శనాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్లలో పొందిన టైంస్లాట్ ప్రకారమే భక్తులు క్యూలైన్ వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది.





