ArticlesNews

తెలుగునాట శతాబ్దాల క్రైస్తవ విస్తరణ చరిత్ర – 1వ భాగం

3views

– ప్రశాంత్ జోషి, సీనియర్ జర్నలిస్ట్

క్రైస్తవ విస్తరణ తెలుగు సీమలో కుగ్రామాల్లో, చిట్టడవుల్లో మొదలైందనుకుంటారు. మరికొందరు అది తీరప్రాంతాల్లో తన దండయాత్ర ఆరంభించిందనుకుంటారు. కాదు, కాదు కళింగసీమను…ఉప్పెనలా తాకిందనుకునేవాళ్లూ ఉన్నారు. లేదు, లేదు…పలనాటిసీమలో అనేవాళ్లూ, రేనాటి నేలలో అని కూడా అంటూ ఉంటారు. ఇవేవీ నిజం కాదు. క్రైస్తవం తెలుగు ప్రాంతాలను వలయాకారంలో ఆక్రమించి, మత విస్తరణ అనే అనైతిక యాత్రను మొదలు పెట్టింది. తెలుగునాట క్రైస్తవ మిషనరీల విస్తరణ కాంక్ష ఎప్పుడు మొదలైంది? ఏ ప్రాంతాలను ఎప్పుడు తాకింది? సంవత్సరాల వారీగా. లెక్కలు తీసే ప్రయత్నంలో భాగమే ఈ వ్యాసం.

“How shall we deal with Hindu and muhammadian enquirers and Convert who have more than one wife” ఇది 1886 లో రెవరెండ్ జెజే లూకాస్ అనే మత బోధకుడు రాసిన పుస్తకం. కానీ, 1840ల చివర నుంచే ఒక వైపు రాయలసీమలోని కడప, కర్నూలు, అనంత పురం, చిత్తూరు జిల్లాల్లో గ్రామాలకు గ్రామాలనే క్రైస్తవానికి మళ్లించాయి మిషనరీలు. నిరుపేద గ్రామాలను, మారుమూల ప్రాంతాలను ఎంపిక చేసుకుని,అక్కడే తిష్టవేసి, తమ విస్తరణ కాంక్షకు ఆచరణ రూపమిచ్చాయి. ఈ మాటలు నేను చెప్పడం లేదు. మిషనరీల విస్తరణ కోసం మన దేశంలో పనిచేసిన జి. హెర్బర్ట్ వేర్ 1912లో రాసిన “Christian Missions In The Telugu Country” పుస్తకంలోనే వాస్తవాల ఆధారంగా క్రైస్తవ మిషనరీలు రాయలసీమను క్రైస్తవసీమగా మార్చిన విషాద వాస్తవాన్ని పంచుకునే ప్రయత్నంలో వెతుకుతుండగా, రెవరెండ్ జేజే లూకాస్ పుస్తకం రహస్యాల చిట్టా విప్పింది. అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ రాజకీయ సంచలనాలకు కేంద్రమైన కడప జిల్లా నుంచే క్రైస్తవ మిషనరీలు చేసిందేమిటో చూద్దాం.1859లో పులివెందుల, జమ్మలమడుగుకు సంబంధించిన కలసపాడు క్రైస్తవ మిషనరీ13 సమావేశాలు నిర్వహించింది. 619 మందితో మతదీక్ష(బాప్టిజం) చేయించింది. మరో 527 మందిని మతం మార్చేందుకు సిద్ధంగా ఉంచింది. 1869లో 1677 మంది మతం మార్చింది. మరో 1,154 మందిని మతం మార్చేందుకు సిద్ధం చేసింది. 1876-77 ప్రాంతంలో రాయలసీమ ప్రాంతంలో పెద్ద కరవు వచ్చింది. దీన్నే ‘నూకల కరవు’గా పిలుస్తారు. వండుకోవడానికి బియ్యం లేక, పశువులకు పెట్టే ‘తౌడు’ తిన్నారు జనం. తౌడు తినడం వల్ల మలవిసర్జన కష్టమై నానా అవస్థలు పడ్డారు. ఆసుపత్రి సౌకర్యం లేక రోజుల తరబడి కడుపు నొప్పితో అల్లాడిపోయారు. దుర్భిక్షంలో వందలమంది ప్రాణాలు కోల్పోయారు. దీనిని ఆసరాగా తీసుకున్న ముత్యాలపాడు మిషన్ ఇంచార్జీ మిస్టర్ స్కాట్ మతమార్పిడి మొదలుపెట్టాడు. 1879లో 76 స్వస్థత సభలు నిర్వహించాడు. 2,377 మందిని క్రైస్తవం స్వీకరించేలా చేశాడు. మరో 1,795 మందిని స్వస్థత సభలకు వచ్చేవారికి అతిథ్యమిచ్చేవారిగా మార్చారు. ఇలా మతమార్పిడికి గురైనవారిలో ఎక్కువగా ఎస్సీలు, వెనుకబడిన కులాలకు చెందినవారు ఉన్నారు. ఏ వర్గాలను లక్ష్యంగా చేసుకుంటే..తమ పని పూర్తవుతుందో మిషనరీలు ముందుగానే గుర్తించేవి. వెంటనే రంగంలోకి దిగేవి. ఆనాటి గెజిట్ల ప్రకారం, మరీ ముఖ్యంగా కడప జిల్లా గెజిట్ ప్రకారమే గ్రామీణ జనాభా 300 నుంచి 400కు మించేది కాదు. పెద్ద గ్రామమైతే జనాభా 1,000 ఉండేదని గెజిట్ చెపుతుంది. హైదరాబాద్ లాంటి మహానగరాల జనాభాయే ఆ కాలంలో 10 వేలకు మించని రోజులు. చిన్న గ్రామమైనా, పెద్ద గ్రామ మైనా, జనాభాల్లో అత్యధికంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలే ఉంటారు. వీరినే లక్ష్యంగా చేసుకున్నాయి మిష నరీలు. వారికి ఆర్థిక, వైద్య సదుపాయాలను ఎరగా వేశాయి. సీమనేలపై శిలువలు పాతాయి. 1855లో ముత్యాలపాడు, మద్దూరు గ్రామాల్లో సుమారు 74 మంది బాప్టిజం తీసుకున్నారని, ఈ ప్రభావంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తండోపతండాలుగా మిషనరీ వద్దకు వచ్చి, తాము కూడా చేరతామని ప్రాధేయపడేవారని ఎం.జే.క్లే అనే క్రైస్తవ మత ప్రబోధకుడు రాసుకున్నాడు. దీంతో 1855 తర్వాత ముత్యాలపాడు చుట్టుపక్కల గ్రామాల్లో మిషనరీ పనిని ఉధృతం చేసినట్టు పేర్కొన్నాడు. అయితే 1853లో జరిగిన ఓ ఘటనతో క్రైస్తవంలో చేరేందుకు జనం పెద్ద ఎత్తున వస్తున్నారనే మాట అబద్ధమని అర్థమవుతుంది. నంద్యాల ప్రాంతంలోని రుద్రవరం గ్రామంలో జూలై, 1852లో 30 మంది బాప్టిజం తీసుకున్నారు. సెప్టెంబర్, 1853లో గూబగుండం, జమ్ములదిన్నె గ్రామాల్లో 80 మంది బాప్టిజం తీసు కున్నారు. దీంతో గ్రామాలకు గ్రామాలనే క్రైస్తవంలోకి చేర్పించాలనే మిషనరీలు భావించాయి. డిసెంబర్, 1853లో గోరిగెన్నూరు, మద్దూరు గ్రామాలకు వెళ్లి స్వస్థత సభలు పెట్టేందుకు ప్రయత్నించాయి ఆ పనిలో భాగంగా వచ్చిన వ్యక్తికి గ్రామాల్లోని దళితులు, బీసీలు అందరూ కలిసి దేహశుద్ధి చేశారు. ఊరి పొలిమేరల వరకూ తరిమారు. అంతకుముందు 1849లో నంద్యాల ప్రాంతంలో రెవరెండ్ ఉరియాడేవిస్ చేసిన ఇదే తరహా ప్రయత్నాలను రుద్రవరం, తదితర గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తిప్పికొట్టారు. మతమార్పిడికి నిరాకరించారు. మిషనరీలవల్ల నేరుగా బాప్టిజం ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడం కష్టమైపోయింది. దీంతో అప్పటికే మతమార్పిడి చేసుకుని, మిషనరీలకు సన్నిహితంగా ఉండే వ్యక్తులను అవి రంగంలోకి దించాయి. అలాంటి వ్యక్తులద్వారా వారి బంధువులను ఉచ్చులోకి లాగే కుట్రకు దిగాయి. ఆ క్రమంలో చుట్టుపక్కల గ్రామాల్లోని బంధువుల ప్రమేయంతో పల్లె ప్రజలు బాప్టిజం తీసుకోవడం పెరిగిపోయింది. కడప, కర్నూలు జిల్లాల్లోనే కాదు ఏ ప్రాంతంలో అయినా భూ తగాదాలుంటాయి. రాయలసీమ జిల్లాల్లో కొంత ఎక్కువ సంఖ్యలో ఉండే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో ఎస్సీ,ఎస్టీ,బీసీ కులాలకు ఉండే భూ తగాదాలను, భూమిలేని వారిని మభ్యపెట్టి, తగాదాల పరిష్కారం మార్గం చూపిస్తామని, తమవద్దకు వస్తే ఆర్థిక స్థితి మారుతుందనే ఆశచూపి మత మార్పిడులకు పాల్పడిన దాఖలాలెన్నో. ఆనాటికి కలరా, మశూచి వంటి వ్యాధులు ప్రబలి గ్రామీణులు అవస్థలు పడేవారు. ప్రాణాలు కోల్పోయేవారు. ఇలాంటి సమయంలో, వైద్య సదుపాయం అందించడం ద్వారా బాధితులతో మిషనరీలు మత మార్పిడి చేయించేవి. ఇది కాస్త మైదాన ప్రాంతాలను అనుసరిస్తూనే, క్రమంగా రాయలసీమ జిల్లాలను ఆనుకొని ఉన్న, నల్లమల అటవీ ప్రాంత పొరుగు గ్రామాలను కూడా ఆక్రమించింది. ముఖ్యంగా పాత కర్నూలు జిల్లాలో ఇప్పటి ప్రకాశం జిల్లా ప్రాంతానికి సైతం తమ కార్యకలాపాలను మిషనరీలు విస్తరిం చాయి.

హెర్బర్ట్ తన పుస్తకంలో నిస్సిగ్గుగా కొన్ని విషయాలు రాశాడు. మిషనరీ కార్యకలాపాల విస్తరణకు రెండు అద్భుతమైన అవకాశాలు వచ్చాయి. అందులో మొదటిది 1897 కరువు కాగా రెండవది 1899-1901లో తీవ్ర క్షామం అని పేర్కొన్నాడు. కర్నూలు, బళ్లారి ప్రాంతాల్లో నీటి కొరతను ప్రస్తావిం చాడు. తాగునీటి కటకట, సాగునీరు లేకపోవడం గురించి రాశాడు. ఒక్క కర్నూలు జిల్లాలో తొమ్మిది నెలల కరవులో 48వేల మంది చనిపోయినట్టు రాశాడు. కరవు, దుర్భిక్షంలో ప్రజల ప్రాణాపాయ స్థితిని సొమ్ము చేసుకుని, అనారోగ్యాన్నీ, పేదరికాన్నీ, నిరక్షరాస్యతను ఆసరాగా చేసుకుని రాయలసీమ ప్రాంతంలో మిషనరీలు క్రైస్తవాన్ని విస్తరించాయి. ఇన్ని మరణాలు సంభవిస్తున్న సందర్భాలను అద్భుత అవకాశాలుగా అభివర్ణించడం, ఉన్మాదానికి పరాకాష్ఠగా చెప్పాలి.