News

హనుమ చరిత్ర వినడం శుభం

276views

సీతారాముల చరిత్ర ఉన్నంత కాలం హనుమంతుని శ్మరణ, చరిత్ర ఉంటుంది. అది హనుమంతునికి శ్రీరాముడు ఇచ్చిన వరం. సీతారాముల పారాయణం జరిగే ప్రతి చోటా ఉండి భక్తులను కాపాడాలని శ్రీరామ చంద్రుడు ఆంజనేయునికి ఉపదేశించారు. హనుమంతుడు చిరంజీవి. హనుమంతుని చరిత్ర వినడం, ఆచరరించడం, అత్యంత పవిత్రం, శుభమని ఆధ్మాత్మిక ప్రవచనకర్త, సనాతన ధర్మోపన్యాసకులు చాగంటి కోటేశ్వరరావు చెప్పారు.బాపట్ల జిల్లా చీరాల పట్టణంలోని ఎన్‌ఆర్‌ అండ్‌ పీఎం హైస్కూల్‌ ప్రాంగణంలో శ్రీ హనుమత్‌ వైభవం పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో చాగంటి కోటేశ్వరరావు రామాయణంలోని సుందరకాండ అంశాలను సోదాహరణంగా ప్రవచించారు. ఆంజనేయుని జన్మ వృత్తాంతం నుంచి రాముల వారితో చేసిన ప్రయాణం, రావణుడు అపహరించిన సీతమ్మ తల్లి జాడ తెలుసుకోవడంలో ఆంజనేయుని పాత్రను కళ్లకు కట్టినట్లు విఫులంగా చెప్పారు. హనుమంతుడు సీతమ్మ వారి దగ్గర ఎంత వినయంగా ఉంటూ నమ్రతగా సమాధానం చెప్తాడో, రావణుని దగ్గర సుగుణాభిరాముని గుణగణాలు, పరాక్రమాలను వివరిస్తూ శరణుగోరమని హెచ్చరించిన తీరును వివరించారు. నోటి వాక్కును ఎంత వరకు సందర్భానుసారంగా వినిపించాలో అర్ధవంతంగా చెప్పారు. సంస్కృత శ్లోకాలను వల్లెవేస్తూ అందుకు తెలుగు అనువాదం చెప్తూ పండితులు, పామరులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ అర్థమయ్యే రీతిలో చాగంటి వారి ప్రవచనాల పరంపరలో పలుమార్లు శ్రోతలు హర్షధ్వనాలతో కూడిన భక్తిభావాన్ని వెలిబుచ్చారు.