
విశాఖ ప్రాంతానికి ఆధ్యాత్మిక పరంగా ఎంతో విశిష్టత ఉందని ఆధ్యాత్మిక ఆచార్యులు త్రిదండి చినజీయర్ స్వామి అన్నారు. గీతా జయంతి వేడుకల ప్రారంభ సభలో ఆయన అనుగ్రహ భాషణం చేస్తూ విశాఖ ప్రాంత వైభవాన్ని వివరించారు. సాక్షాత్ ద్వయ రూపంలో శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి సింహాచల క్షేత్రంలో వెలసిన భక్తులను అనుగ్రహిస్తున్నారన్నారు. సాగర తరంగాలు గత వైభవాన్ని నేటికీ ప్రసరింపజేస్తున్నాయన్నారు. ఆ వైభవాన్ని సమాజానికి అందించడానికి విశాఖ సాగర తీరంలో వేద అధ్యయన, పరిశోధనా కేంద్రం (వారిజ) ఆశ్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వేద స్వరం సాగర తరంగాల ద్వారా ఇతర ప్రాంతాలకు విస్తరింపజేస్తోందన్నారు. 20 ఏళ్ల క్రితం ఆరంభమైన ఈ పాఠశాల ద్వారా వేద విద్యను ఎందరో పూర్తి చేసుకున్నారని తెలిపారు. శ్రీ భాష్యం అప్పలాచార్యులు, శాతులూరి గోపాల కృష్ణమాచార్యులు వంటి మహనీయులు ఆధ్యాత్మిక మార్గాన్ని అందిస్తున్నారన్నారు.





