News

సమానత్వమే అన్నమయ్య ఆకాంక్ష

247views

సమాజంలో సాంఘిక సమానత్వమే అన్నమయ్య ఆకాంక్ష అని, ఆ మేరకే ఆయన రచనలు సాగించారని రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి తెలిపారు. ఈ నెల 6వ తేదీన వేలాదిమంది భక్తులతో ఆయన తలపెట్టిన తిరుమల మహాపాదయాత్ర రేణిగుంట– కడప మార్గంలోని కుక్కలదొడ్డికి చేరింది. ఎమ్మెల్యే ఆకేపాటి మాట్లాడుతూ పదకవితాపితామహుడి వారసులుగా భావించే సుమారు 22 ఏళ్లుగా అన్నమయ్య కాలిమార్గంలో తిరుమలకు గోవింద మాలలు ధారణతో వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటున్నామని వెల్లడించారు. అన్నమయ్య తన సంకీర్తనలతో తిరుమల శ్రీవారికి స్వరార్చన చేసి స్వామి వారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేశారన్నారు. స్వామి దయతోనే సుదీర్ఘ కాలం తిరుమలకు మహా పాదయాత్ర కొనసాగిస్తున్నామని చెప్పారు. తిరుమల శ్రీవారిపై భక్తి నమ్మకమే తమను నడిపిస్తోందని వివరించారు. మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి అన్నమయ్య మార్గం అభివృద్ది చేయాలని డిమాండ్‌ ఉందని తెలిపారు.

ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ స్వామివారి దర్శనానికి కాలినడకన వచ్చే భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని కోరారు. అమరనాథ్‌రెడ్డి చేపడుతున్న మహా పాదయాత్ర భావి తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందన్నారు. అమరనాథ్‌రెడ్డితో పాటు పాదయాత్రలో భాగస్వామ్యం కావడం మహద్భాగ్యంగా భావిస్తున్నానని తెలిపారు. కడప డిప్యూటీ మేయర్‌ నిత్యానందరెడ్డి మాట్లాడుతూ అన్నమయ్య మార్గం అభివృద్ది చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.