News

పరమాత్మే సకల జనబంధువు

368views

కుటుంబంలో బంధువులెవరూ మనల్ని రక్షించలేరని, సకల జనులకు పరమాత్మే బంధువని త్రిదండి అహోబిల రామానుజ జీయర్‌ స్వామి అన్నారు.తూర్పు గోదావరి జిల్లా రాజవోలు గాయత్రీ నగర్‌ రామాలయం వద్ద త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్‌ స్వామి మంగళాశాసనాలతో ఆయన శ్రీమద్భాగవత సప్తాహం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఐదో రోజైన ఆయన తన భాగవత ప్రవచనం కొనసాగించారు. కన్న కూతురిని ఇంద్రుడు, శచీదేవి, నిండు సభలో భార్యను పాండవులు కాపాడలేకపోయారని, అన్నదమ్ములే అయినా వాలి సుగ్రీవుల మధ్య ఘర్షణ జరిగిందని, రావణ, విభీషణుల మధ్య సఖ్యత లోపించిందని.. ఇవన్నీ చూస్తే బంధువులెవరూ మనకు రక్షకులు కారనే విషయం అర్థమవుతుందని ఉదహరించారు. సర్వజన రక్షకుడు సర్వేశ్వరుడు, సర్వహిత బంధువు పరమాత్మేనని పేర్కొన్నారు. గజేంద్ర మోక్షం కూడా ఇదే చెబుతుందన్నారు. చెరువులో స్నానానికి వెళ్లిన గజరాజును మొసలి పట్టి, పీడిస్తూంటే, ఒడ్డున ఉన్న గజేంద్రులు చూస్తూ ఉన్నారే తప్ప రక్షించలేదని చెప్పారు. జగత్కారకభూతుడెవరో వచ్చి కాపాడాలని మొసలికి చిక్కిన గజరాజు ప్రార్థిస్తే, విష్ణుమూర్తి వచ్చి, సుదర్శన చక్రం వదిలిపెట్టడంతో మొసలి తల ఖండితమైందని అహోబిల రామానుజ జీయర్‌ స్వామి వివరించారు. ఇక్కడ మొసలి అంటే కర్మ అని, దాని నుంచి ఎవ్వరూ తప్పించలేరని అన్నారు. అందుకే కర్మను తప్పించే బాధ్యతను పరమాత్మకే ఇవ్వాలని, అప్పుడు తక్కువ నష్టంతో బయట పడవచ్చని చెప్పారు.