News

బంగ్లాలో మైనారిటీలపై మారణహోమం

204views

బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై మారణహోమం జరుగుతోందని, దీని వెనుక తాత్కాలిక ప్రభుత్వ సారథి మహమ్మద్‌ యూనస్‌ కీలక పాత్ర పోషిస్తున్నారని ఆ దేశ మాజీ ప్రధాని షేక్‌ హసీనా ఆరోపించారు. భారత్‌లో ఆశ్రయం పొందుతున్న ఆమె.. న్యూయార్క్‌లో జరిగిన ఓ కార్యక్రమాన్ని ఉద్దేశించి వర్చువల్‌గా ప్రసంగించారు. ‘‘సాయుధులైన దుండగులు నా నివాసాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. భద్రతా దళాలు కాల్పులు జరిపితే ఆ రోజున చాలా మంది చనిపోయేవారు. అందుకే ఏం జరిగినా కాల్పులు జరపొద్దని ఆదేశాలిచ్చాను’’ అని హసీనా చెప్పారు. విద్యార్థుల ఉద్యమం కారణంగా ఆగస్టు 5న ఢాకాలోని తన అధికార నివాసాన్ని విడిచి హసీనా హెలికాప్టర్‌లో భారత్‌కు తరలివచ్చిన సంగతి తెలిసిందే. హింసను ఆపడానికి తాను దేశాన్ని వీడానని.. కానీ అది ఇంకా కొనసాగుతూనే ఉందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రస్తుత బంగ్లా ప్రభుత్వం మైనారిటీలను రక్షించడంలో విఫలమైందని అన్నారు. ‘‘హిందువులు, బౌద్ధులు, క్రైస్తవులు.. ఎవరినీ వదిలిపెట్టడం లేదు. 11 చర్చిలు ధ్వంసమయ్యాయి. ఆలయాలు, బౌద్ధమందిరాలపై దాడులు జరిగాయి. హిందువులు ఆందోళన చేస్తే సాధువు చిన్మయ్‌ కృష్ణదాస్‌ను అరెస్టు చేశారు. ఎందుకు మైనారిటీలను హింసిస్తున్నారు?’’ అని హసీనా ప్రశ్నించారు. 1975లో తన తండ్రి ముజిబుర్‌ రెహ్మన్‌ను హత్య చేసినట్లే.. తనను, తన సోదరి షేక్‌ రెహానాను అంతమొందించడానికి కుట్ర జరిగిందని అన్నారు.