
బంగ్లాదేశ్‌లో హిందువులపై దౌర్జన్యాలు జరుగుతున్నాయని, భారత్‌లోనూ మైనారిటీలపై అఘాయిత్యాలు జరుగుతుంటే భారత్‌కూ బంగ్లాదేశ్‌కూ తేడా ఏమిందని మెహబూబా ముఫ్తీ వ్యాఖ్యానించిన కొద్ది గంటలకే జమ్మూకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా సైతం ఇదే తరహాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో ముస్లింలు అభద్రతాభావంతో ఉన్నారని, రాజ్యాంగం హామీ ఇచ్చినట్టుగా మతం ఆధారంగా వివక్ష ఉండరాదని అయన వ్యాఖ్యానించారు.
దేశంలోని మందిరాలు, మసీదుల విషయంలో ఇటీవల జరుగుతున్న వరుస వివాదాలపై ఫరూక్ అబ్దుల్లా మీడియాతో సోమవారంనాడు మాట్లాడారు. ”ముస్లింలు అభద్రతా భావంతో ఉన్నారనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. దీనిని తక్షణం ఆపాలని భారత ప్రభుత్వాన్ని కోరుతున్నాను. 24 కోట్ల ముస్లింలను సముద్రంలోకి నెట్టేయలేరు. వారు (ప్రభుత్వం) ముస్లింలను సమానంగా చూడాలి. మతం ఆధారంగా వివక్ష అనేది రాజ్యాంగంలో లేదు. వాళ్లు (బీజేపీ సారథ్యంలోని కేంద్రం) ఒక విషయం గుర్తుంచుకోవాలి. వాళ్లు కనుక రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తే ఇక ఇండియా అనేది ఎక్కడుంటుంది?” అని ఫరూఖ్ అబ్దుల్లా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.





