
ఇస్కాన్‌కు చెందిన చిన్మయ్ కృష్ణదాస్‌ను బంగ్లాదేశ్ లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే కోర్టులో ఆయన బెయిల్ పిటిషన్‌పై వాదనలు వినిపించేందుకు లాయర్లు ఎవరూ ముందుకురావట్లేదని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. కృష్ణదాస్ కేసును వాదించేందుకు ముందుకువచ్చిన ఓ న్యాయవాదిపై ఆందోళనకారులు తీవ్రంగా దాడి చేయడంతో ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఇస్కాన్ కోల్‌కతా ప్రతినిధి రాధారామన్ దాస్ పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా న్యాయవాది ఇంటిపైనా దాడి చేశారన్నారు.
రవీంద్ర ఘోష్ అనే మరో న్యాయవాది కేసును వాదించేందుకు దాదాపు 250 కిలోమీటర్లు ప్రయాణించి ఢాకా నుంచి వస్తే.. స్థానికులు అతడిని కోర్టు ప్రాంగణంలోకి అనుమతించలేదని ఆరోపించారు. దీంతో చిన్మయ్ కృష్ణదాస్ తరఫున కేసును వాదించేందుకు లాయర్లు భయపడుతున్నారని తెలిపారు. దీంతో బెయిల్ విచారణను బంగ్లాదేశ్ కోర్టు వచ్చే నెలకు వాయిదా వేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.





