
బంగ్లాదేశ్ లో హిందువులపై, హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాష్టీకానికి వ్యతిరేకంగా అసోంలో సనాతనీ ఓక్యోమంచ్ గళమెత్తింతి. హిందువులపై దాడులు చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, ఇస్కాన్ స్వామీజీ చిన్మయ్ కృష్ణదాస్ ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ… భారీ నిరసన కార్యక్రమం నిర్వహించింది. ఈ నిరసన కార్యక్రమానికి అధిక సంఖ్యలో హిందువులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తారు.
కరీంగంజ్ కళాశాల ప్రాంగణం నుంచి 2,000 మందితో బైక్ ర్యాలీ జరిగింది. సుతార్ కండీ సరిహద్దు వరకూ ఇది సాగింది. ఆ తర్వాత సంఘీభావ సభకి 60 వేల మంది హిందువులు హాజరయ్యారు.బంగ్లాదేశ్ హిందువులకు, ఇస్కాన్ స్వామీజీలకు తమ సంఘీభావాన్ని ప్రకటించారు.ఈ సభలో సనాతనీ ఓక్యోమంచ్ కోఆర్డినేటర్ శంతను నాయక్, సిల్చార్ శంకర మఠం అషిత్ చక్రవర్తి, బిగానంద మహారాజ్; బైకానంత మహారాజ్ తదితరులు హాజరయ్యారు. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను వెంటనే ఆపాలని, వారికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే ఇస్కాన్ స్వామీజీని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బంగ్లాదేశ్ లో మానవ హక్కుల ఉల్లంఘన తీవ్ర స్థాయిలో వుందన్నారు.
ఈ సందర్భంగా పలు డిమాండ్లను వుంచారు. అందులో మొదటిది బంగ్లాదేశ్ హిందువులకు రక్షణ కల్పించాలని, అలాగే ఇస్కాన్ స్వామీజీని వెంటనే విడుదల చేయాలని, లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
2. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న అత్యాచారాలు, దోపిడీలు, హత్యలను ఖండించింది. ఈ హేయమైన చర్యను వెంటనే ఆపేయాలని డిమాండ్ చేసింది. మైనారిటీల హక్కులను కాపాడాలని కోరింది.
3.అలాగే బంగ్లాదేశ్ లో దేవాలయాల విధ్వంసాన్ని వెంటనే ఆపేయాలని డిమాండ్ చేసింది. హిందూ కుటుంబాలు వలస వెళ్లొద్దని, మతపరమైన హక్కులను కల్పించాలని కూడా మంచ్ డిమాండ్ చేసింది.
4. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న అకృత్యాల విషయంలో ప్రపంచ సంఘాలు వెంటనే జోక్యం చేసుకోవాలని, అక్కడి హింసను ఆపేందుకు తమ వంతు ప్రయత్నాలు చేయాలని కూడా డిమాండ్ చేసింది.





