News

‘ఇస్కాన్‌’పై నిషేధానికి బంగ్లా కోర్టు నిరాకరణ

173views

ఇస్కాన్‌ పై నిషేధించేందుకు బంగ్లాదేశ్‌లోని ఢాకా హైకోర్టు నిరాకరించింది. ఇటీవల చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో హిందూ సంస్థ కార్యకలాపాలపై నిషేధం విధించాలన్న పిటిషనర్‌ వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. అయితే, దేశంలో ఇస్కాన్‌ ఇటీవలి కార్యకలాపాలపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుందో నివేదిక ఇవ్వాలని అటార్నీ జనరల్‌కు ఆదేశాలు ఇచ్చినట్లు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

మరోవైపు ఇస్కాన్‌ తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతోందని, దీనిపై నిషేధం విధించాలని పది మందితో కూడిన సుప్రీం కోర్టు న్యాయమూర్తుల బృందం అక్కడి ప్రభుత్వానికి లీగల్‌ నోటీసు పంపించింది. ఇటీవలి ఘర్షణల్లో ఓ న్యాయవాది మరణానికి కారణమైన వారిని విచారించాలని డిమాండ్‌ చేసింది. అయితే, ఇస్కాన్‌ హిందూ మతానికి చెందిన సంస్థ అని, దాని కార్యకలాపాలపై దృష్టి సారిస్తున్నట్లు బంగ్లాదేశ్‌ ప్రభుత్వం ఢాకా హైకోర్టుకు ఇటీవల తెలిపింది.

బంగ్లాదేశ్‌ జెండాను అగౌరవపరిచారనే ఆరోపణలపై చిన్మయ్‌ కృష్ణదాస్‌ ప్రభును ఢాకా పోలీసులు అరెస్టు చేయడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. దీనిని వ్యతిరేకిస్తూ అక్కడి హిందువులు పెద్దఎత్తున నిరసనలు చేపడుతున్నారు. అయితే, గతంలో ఇస్కాన్‌లో క్రియాశీలంగా ఉన్న చిన్మయ్‌.. క్రమశిక్షణా చర్యల్లో భాగంగా అన్ని పదవులకు దూరమైనట్లు సమాచారం.