ArticlesNews

అజ్మేర్ దర్గాను శివాలయంపై నిర్మించారంటూ పిటిషన్, కోర్టు నోటీసులు

50views

రాజస్థాన్‌ అజ్మేర్‌లోని సూఫీ సాధువు మొయినుద్దీన్ చిష్తీ దర్గా (సమాధి)ని శివాలయం మీద నిర్మించారంటూ స్థానిక కోర్టులో పిటిషన్ దాఖలైంది. సెప్టెంబర్‌లో దాఖలైన పిటిషన్‌లో ఫిర్యాదుదారుడు ఆ ప్రదేశంలో మళ్ళీ శివపూజలు నిర్వహించుకోడానికి అనుమతించాలని కోరారు. దానికి స్పందనగా న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వానికి, భారత పురావస్తు సర్వేక్షణ సంస్థకు (ఎఎస్ఐ) నోటీసులు జారీ చేసింది.

ఆ పిటిషన్‌పై తమ స్పందన తెలియజేయాలంటూ అజ్మేర్ దర్గా కమిటీకి, మైనారిటీ వ్యవహారాల శాఖకు, ఢిల్లీలోని ఎఎస్ఐ కార్యాలయానికీ అజ్మేర్ కోర్టు సివిల్ జడ్జి మన్మోహన్ చందేల్ నోటీసులు జారీ చేసారని పిటిషనర్ తరఫు న్యాయవాది యోగేష్ సిరోజా వెల్లడించారు.

హిందూసేన అనే స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు విష్ణు గుప్తా ఆ పిటిషన్‌ను దాఖలు చేసారు. ‘‘అజ్మేర్ దర్గా నిజానికి సంకట మోచన్ మహాదేవుడి మందిరం అని ప్రకటించాలన్నది మా డిమాండ్. దర్గాకు ఎటువంటి రిజిస్ట్రేషన్ అయినా ఉంటే దాన్ని రద్దు చేయాలి. ఆ ప్రదేశాన్ని ఎఎస్ఐతో సర్వే చేయించాలి. హిందువులకు అక్కడ పూజలు చేసుకోడానికి హక్కులు ఇవ్వాలి’’ అని ఆయన చెప్పారు.

పిటిషనర్ తన వాదనకు ఆధారంగా హరవిలాస్ శారద అనే విశ్రాంత న్యాయమూర్తి 1911లో రాసిన పుస్తకాన్ని ఉటంకించారు. అజ్మేర్ దర్గా చుట్టుపక్కల, ఆ చేరువలోనే ఉన్న బులంద్ దర్వాజా మీద కూడా హిందూ దేవీదేవతల విగ్రహాలు, హిందూధర్మానికి చెందిన శిల్పాలూ స్పష్టంగా కనిపిస్తున్నాయని తెలియజేసారు.

‘అజ్మేర్: హిస్టారికల్ అండ్ డిస్క్రిప్టివ్’ అనే ఆ పుస్తకంలోని వివరాల ప్రకారం శివాలయాన్ని కూల్చి ఆ శిథిలాలతోనే దర్గాను నిర్మించారు. ఆ ప్రదేశం నడిమధ్యలో ఒక జైన దేవాలయం కూడా ఉందని పిటిషనర్ చెప్పుకొచ్చారు.

సహజంగానే, ఆ ప్రకటనలను దర్గా కమిటీ ఖండించింది. దర్గాలు భిన్నత్వంలో ఏకత్వాన్ని, బహుళత్వాన్నీ ప్రచారం చేస్తాయని అంజుమన్ సయ్యద్ జడ్గావ్ కార్యదర్శి సయ్యద్ సార్వర్ చిష్తీ చెప్పారు. అజ్మేర్ దర్గాకు అప్ఘానిస్తాన్ నుంచి ఇండోనేషియా వరకూ పలు వివిధ దేశాల్లో లక్షలాది అనుయాయులు ఉన్నారని వివరించారు.

‘‘అటువంటి చర్యలు మత సామరస్యానికీ దేశానికీ వ్యతిరేకం. ఈ విషయంలో కోర్టు మూడు పక్షాలకు నోటీసులు పంపించింది. మేం ఏం చేయాలో అదిచేస్తాం. ఇలా కాశీ, మథుర తదితర ప్రదేశాల్లోని పురాతనమైన మజీదులను లక్ష్యం చేసుకోవడం మంచి పరిణామం కాదు’’ అని సయ్యద్ సార్వర్ చిష్తీ వాదించారు.

ఈ కేసు తదుపరి విచారణ డిసెంబర్ 20కి వాయిదా పడింది.