News

మతమార్పిడి ఆరోపణల నేపథ్యంలో వెకేషన్ బైబిల్ స్కూల్‌పై చర్చిల ఆంక్షలు

2views

ముంబై: మతమార్పిడి ఆరోపణలు, చట్టపరమైన వివాదాల నేపథ్యంలో వెకేషన్ బైబిల్ స్కూల్ (వీబీఎస్) కార్యక్రమాల నిర్వహణపై పలు ప్రొటెస్టంట్ చర్చిలు ఆంక్షలు విధిస్తున్నాయి. కొన్ని చర్చిలు ఈ ఏడాది కార్యక్రమాలను రద్దు చేయగా, మరికొన్ని క్రైస్తవ మతానికి చెందిన పిల్లలకు మాత్రమే ప్రవేశం కల్పించాలని నిర్ణయించాయి.

వేసవి, దీపావళి సెలవుల్లో 5 నుంచి 15 ఏళ్ల వయస్సు గల పిల్లల కోసం చర్చిల ఆధ్వర్యంలో వెకేషన్ బైబిల్ స్కూల్ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఇందులో పాటలు, ఆటలు, చేతిపనులు, బైబిల్ కథల ద్వారా పిల్లలకు బోధనలు అందిస్తారు. అయితే ఇటీవల మతమార్పిడి ఆరోపణలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాల నిర్వహణలో చర్చిలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.

ముంబై, నాగ్‌పూర్ సహా పలు ప్రాంతాలకు చెందిన చర్చి పాస్టర్లు ఈ విషయాలను మీడియాకు వెల్లడించారు. పిల్లలను ప్రలోభపెట్టి కార్యక్రమాలకు రప్పించడం లేదని స్పష్టం చేసేందుకు చర్చిల వద్ద నోటీసులు ఏర్పాటు చేయడం, అధికారిక నమోదు తప్పనిసరి చేయడం, ప్రవేశ రుసుము వసూలు చేయడం వంటి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

ఇదిలా ఉండగా, ముంబైలో అద్దె హాళ్లు, పాఠశాలలు, ప్రైవేటు ఇళ్లలో నిర్వహిస్తున్న ప్రార్థనా సమావేశాలపై బజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) కార్యకర్తలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ సమావేశాలను మతమార్పిడుల కోసం వినియోగిస్తున్నారంటూ ఆరోపణలు చేశారు.

2026 ఏప్రిల్ నుంచి జూలై మధ్య ఇటువంటి ఐదు ఘటనలకు సంబంధించి మొత్తం తొమ్మిది కేసులు నమోదైనట్లు సమాచారం. వీటిలో ఏడు కేసులు ప్రార్థనా సమావేశాల నిర్వాహకులు, పాల్గొన్న వ్యక్తులపై నమోదయ్యాయి.

మతమార్పిడి నిరోధక చట్టంతో మారిన పరిస్థితులు
రాష్ట్రంలో మతమార్పిడి నిరోధక చట్టం ఆగస్టు 28న అమల్లోకి వచ్చినట్లు కథనంలో పేర్కొన్నారు. ఈ చట్టం ప్రకారం మతమార్పిడికి సహకరించిన వ్యక్తులు, ఆ మార్పిడి స్వచ్ఛందంగా జరిగిందని నిరూపించాల్సిన బాధ్యతను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

చట్టం అమల్లోకి రాకముందు ప్రార్థనా సమావేశాలకు హాజరయ్యే వారి నుంచి పాస్టర్లు లిఖితపూర్వక ప్రకటనలు తీసుకునేవారని సమాచారం. తాము స్వచ్ఛందంగా, ఎలాంటి బాహ్య ఒత్తిడి లేదా ప్రలోభాలకు లోనుకాకుండా ప్రార్థనా సమావేశాలకు హాజరవుతున్నట్లు ఆ ప్రకటనల్లో పేర్కొనేవారు.

తాజా పరిణామాల నేపథ్యంలో మతపరమైన కార్యక్రమాల నిర్వహణలో చర్చిలు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.