News

వాయు కాలుష్యం వేళ ఢిల్లీలో కృత్రిమ వర్షం- సాధ్యాసాధ్యాలపై ఐఐటీ కాన్పూర్ అధ్యయనం

0views

దేశ రాజధాని ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు ఐఐటీ కాన్పూర్​ కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో మరోసారి కృత్రిమ వర్షం (క్లౌడ్ సీడింగ్) సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేస్తున్నట్లు వెల్లడించింది. ప్రస్తుత వాతావరణంలో మేఘాలు ఏర్పడటానికి, వర్షం కురవడానికి సరిపడా తేమ ఉందో లేదో అంచనా వేసేందుకు ఈ పరిశీలన జరుగుతోందని ఐఐటీ వర్గాలు తెలిపాయి. అనుకూలమైన తేమ పరిస్థితులను సంస్థ నిర్ధరించుకున్న తర్వాతే ఈ ఆపరేషన్‌పై తుది నిర్ణయం తీసుకుంటారని చెప్పాయి. ఈ ఆపరేషన్ కోసం విమానం సిద్ధంగా ఉందని, అనుమతులు రాగానే ఇది దిల్లీ నుంచే టేకాఫ్ అవుతుందని అధికారులు వెల్లడించారు.

దీపావళి తర్వాత పెరిగిన కాలుష్యం
దీపావళి వేడుకల అనంతరం ఢిల్లీ లో వాయు కాలుష్యం తీవ్రస్థాయికి చేరుకుంది. ఉష్ణోగ్రతలు పడిపోవడం, దట్టమైన పొగమంచు కమ్మేయడంతో కాలుష్య తీవ్రత మరింత పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా వాటర్ స్ప్రింక్లర్లను ఉపయోగించి, సూక్ష్మ కణాల ప్రభావాన్ని తగ్గించడానికి దిల్లీ ప్రభుత్వం కాలుష్య నియంత్రణ చర్యలు తీసుకుంటోంది. బుధవారం ఉదయం 7 గంటలకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB) రికార్డు చేసిన గణాంకాల ప్రకారం దిల్లీలో సగటు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 299 పూర్​ కేటగిరీగా నమోదైంది.

ఛావ్లాలో అత్యధికంగా 396 ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్
సగటు AQI మెరుగ్గా కనిపిస్తున్నప్పటికీ, ఢిల్లీ లోని పలు కీలక ప్రాంతాల్లో గాలి నాణ్యత ‘అత్యంత అధ్వాన్నం’ (Very Poor) కేటగిరీలోనే కొనసాగుతోంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) డేటా ప్రకారం, ఛావ్లాలో అత్యధికంగా 396 ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) నమోదైంది. ఆ తర్వాతి స్థానాల్లో చాందినీ చౌక్ (379), DTU (375), IIT దిల్లీ (375), నార్త్ క్యాంపస్ (374), ITO (367), బురారీ క్రాసింగ్ (362), పూసా (359), NIH నరేలా (352), NSUT జాఫర్‌పూర్ (351), NSIT ద్వారక (350), CRRI మథుర రోడ్ (348), పంజాబీ బాగ్ (341), JNU (339), అయా నగర్ (337), తల్కటోరా గార్డెన్ (331), వివేక్ విహార్ (326), సిరిఫోర్ట్ (321), వజీర్‌పూర్ (321), జహంగీర్‌పురి (320), బురారీ (315), బదర్‌పూర్ (312), ముండ్కా (305), ఆనంద్ విహార్ (304), బావానా (304) ఆర్.కె. పురం (300) ఉన్నాయి.

రాజధానిలోని మరికొన్ని ప్రాంతాల్లో గాలి నాణ్యత ‘పేలవమైన’ (Poor) విభాగంలోనే కొనసాగింది. రోహిణిలో 298, అశోక్ విహార్‌లో 298, ద్వారక-సెక్టార్ 8లో 295, జరోడా కలాన్‌లో 289, ఇగ్నో (IGNOU) మైదాన్ గర్హిలో 287, IGI విమానాశ్రయం (T3) వద్ద 282, అలీపూర్‌లో 279, ఉత్తమ్ నగర్‌లో 259 AQI నమోదయ్యాయి. ఈ విభాగంలో IMD లోధి రోడ్ వద్ద అత్యల్పంగా 203 AQI నమోదైంది.

కృత్రిమ వర్షాలు ఎలా కురిపిస్తారు?
ముందుగా శాస్త్రవేత్తలు కృత్రిమ వర్షానికి అనువైన మేఘాలను గుర్తిస్తారు. అందులో సరిపడా తేమ ఉంటుంది. కానీ, వర్షాలు కురిసేందుకు అనువైన పరిస్థితులు ఉండవు. అలాంటి సందర్భంలోనే సిల్వర్‌ అయోడైడ్‌, పొటాషియం అయోడైడ్‌ లాంటి రసాయన ఉత్ప్రేరకాలను మేఘాలపై చల్లి క్లౌడ్‌ సీడింగ్‌ ప్రక్రియను చేపడతారు. ఇవి మేఘాల్లోని తేమను కరిగించి, వర్షపు బిందువుల రూపంలో కింద పడేందుకు సహకరిస్తాయి. ఇందుకు కొన్ని సార్లు పొడి మంచును కూడా వినియోగిస్తారు. దీనివల్ల మేఘాలు చల్లబడి వర్షం కురిసేందుకు వీలుంటుంది.