
భాగ్యనగర్ వేదికగా నాలుగు రోజుల పాటు జరుగుతున్న లోక్ మంథన్ భాగ్యనగర్ 2024 కార్యక్రమాన్ని శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభిస్తారని లోక్ మంథన్ భాగ్యనగర్ 2024 రిసెప్షన్ కమిటీ చైర్మన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. అలాగే మూడు రోజుల పాటు ఆరెస్సెస్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ కూడా పాల్గొంటారని, కుటుంబ వ్యవస్థ, దాని ప్రాధాన్యత, సామాజిక సమరసత, స్వదేశీ తదితర అంశాలపై వారు మార్గదర్శనం చేస్తారని తెలిపారు.లోక్ మంథన్ భాగ్యనగర్ 2024 ఎగ్జిబిషన్ కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ… ఈ కార్యక్రమంలో ఎవ్వరు కూడా ప్లాస్టిక్ వస్తువులను వాడొద్దని పిలుపునిచ్చారు. ఈ లోక్ మంథన్ కార్యక్రమానికి ప్రజలందరూ విచ్చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమం రాజకీయాలకు అతీతంగా జరుగుతుందని, భారతీయ సంస్కృతికి సంబంధించిన కార్యక్రమని, దేశానికి ఉపయోగపడే కార్యక్రమమని అన్నారు. ఈ నాలుగు రోజుల పాటు జరిగే కార్యక్రమానికి మీడియా కూడా సహకరించి, కవరేజీ చేయాలని కోరారు. ఏ ఉద్దేశంతోనైతే ఈ లోక్ మంథన్ ప్రారంభమైందో అది విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ లోక్ మంథన్ లో దేశ వ్యాప్తంగా వున్న ప్రముఖంగా వున్న కళాకారులు, మేధావులు, ఆర్టిస్టులు, ఆలోచనాపరులు, పద్మ అవార్డు గ్రహీతలు పాల్గొంటారని తెలిపారు. ఎగ్జిబిషన్ కార్యక్రమం శిల్పారామంలో జరుగుతుందని, మంథన్ మాత్రం శిల్పకళా వేదికలో జరుగుతుందన్నారు. ఈ మంథన్ కార్యక్రమానికి 2,500 మంది ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. మరోవైపు ఈ కార్యక్రమ ముగింపు కార్యక్రమంలో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, గజేంద్ర సింగ్ షేకావత్ పాల్గొంటారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.





