
దీపావళి పండుగను రాష్ట్ర ప్రభుత్వ సెలవుదినంగా ప్రకటిస్తున్నట్లు అమెరికాలోని పెన్సిల్వేనియా ప్రకటించింది. దీనికి సంబంధించిన ఓ బిల్లును ఆమోదిస్తూ గవర్నర్ జోష్ షాపిరో సంతకం చేశారు. ఈ నిర్ణయం తమ రాష్ట్రంలో నివసించే ఎంతోమంది హిందువులు, బౌద్ధులు, జైనులు, సిక్కులకు అందిస్తున్న ఓ అపురూప కానుక అని అభివర్ణించారు. అన్ని వర్గాల ప్రజల సంప్రదాయాలను తమ ప్రభుత్వం గౌరవిస్తోంది అని అనేందుకు ఈ నిర్ణయమే ఉదాహరణ అని గవర్నర్ పేర్కొన్నారు. ఇకపై ప్రతి సంవత్సరం తమ రాష్ట్రంలో దీపావళి రోజున పబ్లిక్ హాలిడే వుంటుందని ప్రకటించారు. అక్టోబర్ 31 నుంచి నవంబర్ 1 రకూ జరిగే దీపావళి వేడుకలు ఈ కొత్త చట్టం ప్రకారం అధికారికంగా గుర్తించిన మొట్టమొదటి వేడుక అవుతుంది.
అయితే యూఎస్ లోని మరికొన్ని ప్రాంతాలు కూడా దీపావళి రోజున అధికారికంగా సెలవు ప్రకటించారు. 2023 లో న్యూయార్క్ గవర్నర్ కాథీ హోచుల్ న్యూయార్క్ నగరంలోని ప్రభుత్వ పాఠశాలలకు దీపావళి రోజున సెలవులు ప్రకటించారు. దీనికి సంబంధించిన చట్టంపై సంతకం కూడా చేశారు.
న్యూజెర్సీలో ఇంకా అధికారికంగా దీపావళి సెలవు అనే చట్టాన్ని ఆమోదించలేదు. కానీ అనేక పాఠశాలలు, విద్యార్థులకు ఒక రోజు సెలవు మాత్రం ఇస్తోంది. దీని ద్వారా హిందువుల పండుగ దీపావళికి అక్కడి ప్రభుత్వం ప్రాముఖ్యాన్ని ఇస్తోందని అర్థమైపోతుంది.
యునైటెడ్ కింగ్ డమ్ లో దీపావళి అధికారిక సెలవు లేదు కానీ.. హిందువులు భారీ సంఖ్యలో వున్న కారణంగా పండుగను నగరాల్లో ఆనందంగా జరుపుకుంటారు. లిసిస్టర్, బెల్ ఫాస్ట్, లండన్, ఎడిన్ బర్గ్, బర్మింగ్ హోమ్ లో కూడా దీపావళిని ఉత్సాహంగా జరుపుకుంటారు. కెనడాలో కూడా దీపావళి రోజున అధికారిక సెలవు దినంగా అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. కాలేజీలు, కార్యాలయాలు దీపావళి రోజున ఈవెంట్లను నిర్వహిస్తాయి.





