ArticlesNews

కార్తిక ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి సిద్ధం

217views

విజయవాడ శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం కొలువైన ఇంద్రకీలాద్రి కార్తిక మాసోత్స వాలకు సిద్ధమైంది. నవంబర్‌ రెండు నుంచి డిసెంబర్‌ ఒకటో తేదీ వరకు కార్తిక మాసోత్సవాల్లో నిత్యం మల్లేశ్వరస్వామికి విశేష అభిషేకాలు, అర్చనలు జరుగుతాయి. రోజూ మల్లేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో సహస్ర లింగార్చన, సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవ, ఆకాశ దీపోత్సవం నిర్వహిస్తారు. ప్రత్యేకంగా స్వామికి బిల్వార్చన, కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని కోటి దీపోత్సవం, జ్వాలాతోరణం, మాస శివరాత్రి వంటి పర్వదినాలను విశేషంగా నిర్వహిస్తారు. నెల రోజులపాటు స్వామికి నిర్వహించే విశేష పూజల్లో భక్తులు పాల్గొనేందుకు ఆర్జిత సేవా టికెట్లు విక్రయిస్తోంది.

ఆర్జిత సేవలు ఇవీ..
కార్తిక మాసోత్సవాన్ని పురస్కరించుకుని మల్లేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఉదయం ఎనిమిది గంటలకు కాఠక పారాయణం, శివ పంచాక్షరి, లక్ష్మీగణపతి జపాలు, సహస్ర లింగార్చన జరుగుతాయి. రోజూ సాయంత్రం 3.30 నుంచి ఏడు గంటల వరకు అభిషేకాలను నిర్వహిస్తారు. స్వామికి జరిగే అభిషేకాల్లో పాల్గొనే భక్తులు టికెట్‌ కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

ఆకాశ దీపం
కార్తికమాసం నెల రోజులు ప్రదోష కాలంలో అమ్మ వారి ప్రధాన ఆలయం, మల్లేశ్వర స్వామి గుడి, శివకామ సుందరీ సమే త నటరాజస్వామి ఆలయ ప్రాంగణంలో ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు. సాయంత్రం స్వామికి మహానివేదన, పంచహారతులు, చతుర్వేద స్వస్తి, అనంతరం సహస్ర దీపాలంకరణ సేవ జరుగుతాయి. ఆది దంప తుల ఉత్సవమూర్తులకు సహస్ర దీపాలంకరణ సేవలో భక్తులు పాల్గొనే అవకాశాన్ని దేవస్థానం కల్పిస్తోంది. ఉత్సవ మూర్తులకు ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం సహస్రదీపాలంకరణ సేవ జరుగుతుంది. ఆలయ అర్చకులతోపాటు అధికారులు స్వయంగా దీపాలను వెలిగించి సేవ చేసుకుంటారు. ఈ సేవలో భక్తులు పాల్గొనే అవకాశాన్ని దేవస్థానం కల్పిస్తోంది.

15న కోటి దీపోత్సవం
కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని నవంబర్‌ 15వ తేదీన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవాన్ని నిర్వహిస్తారు. ఆది దంపతుల ఆలయా లతోపాటు ఆలయ ప్రాంగణంలోని ఉపాలయాలు, మహామండపం, రాజగోపు రం, ఘాట్‌రోడ్డు పరిసరాలను దీపాలతో అలంకరిస్తారు. రాత్రి మల్లేశ్వర స్వామి ఆలయం వద్ద జ్వాలాతోరణం కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు నిర్వహిస్తారు. ఇక 29వ తేదీ మాస శివరాత్రిని పురస్కరించుకుని స్వామికి అన్నాభిషేకం జరుగుతుంది.

బిల్వార్చన తేదీలు
కార్తిక మాసంలో మల్లేశ్వర స్వామికి ప్రత్యేక తిథుల్లో బిల్వార్చన నిర్వహిస్తారు. నవంబర్‌ నాలుగో తేదీన శుద్ధ చవితి, 11న శుద్ధ దశమి, 12న శుద్ధ ఏకాదశి, 15న పౌర్ణమి, 18న బహుళ తదియ, 25న బహుళ దశమి, 26న బహుళ ఏకాదశి, 29న మాస శివరాత్రిని పురస్కరించుకుని ప్రత్యేక బిల్వార్చన నిర్వహించాలని వైదిక కమిటీ నిర్ణయించింది.