
రాష్ట్రంలోనే ప్రత్యేకత సంతరించుకున్న దేవరగట్టు ఉత్సవాలకు అంకురార్పణ పలికారు.కర్నూలు జిల్లా నెరణికి గ్రామ ఆలయంలో కొలువుంచిన మాళ మల్లేశ్వరస్వామి ఉత్సవమూర్తులకు సోమవారం మధ్యాహ్నం దేవరగట్టు ఆలయ నిర్వాహకులు, నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామపెద్దల సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి పల్లకీతో పాటు ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా దేవరగట్టు కంకణ కట్టపైకి చేర్చారు. సాయంత్రం ఆలయంలోని మూల విరాట్‌కు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఆ తర్వాత కంకణ కట్టపై కొలువుదీరిన మాత మాళమ్మ, మల్లేశ్వరునికి భక్తుల జయజయ ధ్వానాల మధ్య నెరణికి పురోహితులు కంకణధారణ నిర్వహించి నిశ్చితార్థం చేశారు. ఈ నెల 12న విజయదశమి రోజున మాంగల్యధారణ, కల్యాణోత్సవం నిర్వహించడానికి నిశ్చయించారు. కల్యాణం తర్వాత స్వామి వారి జైత్రయాత్ర ప్రారంభమవుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. మరుసటి రోజు 13న దైవ వాణీ (కార్ణీకం), 14న రథోత్సవం, 15న గొరవయ్యల ఆటలు, గొలుసు తెంపుట, దేవదాసీల క్రీడోత్సవం, కంకణ విసర్జన, 16న మాళమల్లేశ్వర స్వామి విగ్రహాలు నెరణికి గ్రామానికి చేరడంతో ఉత్సవాలు ముగుస్తాయని తెలిపారు. కార్యక్రమానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలూరు సీఐ శ్రీనివాసనాయక్ ఆధ్వర్యంలో హొళగుంద ఎస్‌ఐ బాల నరసింహులు, సిబ్బంది బందోబస్తు చేపట్టారు.





