News

అసోంలో  ఎన్నార్సీ దరఖాస్తుదారులు 3.30 కోట్లు

554views

సోంలో ఎన్నార్సీకి దరఖాస్తు చేసుకున్న అందరి వివరాలతో కూడిన పూర్తి స్థాయి జాబితాను కేంద్ర ప్రభుత్వం శనివారం విడుదల చేసింది. మొత్తం 3.30కోట్ల మంది దరఖాస్తుదారుల వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరిచారు. దీంతో ఎవరు ఎన్నార్సీలో ఉన్నారు, ఎవర్ని మినహాయించారో చూసుకోవచ్చు. అలాగే ఒకే కుటుంబానికి చెందిన సభ్యుల వివరాలు కామన్‌ ఏఆర్‌ఎన్‌ నంబరు ద్వారా సరిచూసుకోవచ్చు. తుది జాబితా ఆగస్టు 31నే విడుదలైనప్పటికీ దాంట్లో అందరి వివరాలను వెల్లడించలేదు. ముసాయిదా జాబితాలో లేకుండా కొత్తగా ఎన్నార్సీలో చేర్చిన వారి జాబితా మాత్రమే ఆగస్టు 31న విడుదల చేశారు. దాన్ని అనుబంధ జాబితాగా పేర్కొన్నారు. తాజాగా దరఖాస్తు చేసుకున్న ప్రతిఒక్కరి వివరాలను వారి వారి ఎన్నార్సీ స్థితితో సహా ప్రచురించారు.

10వేల బలగాలు వెనక్కి:
ఎన్నార్సీ తుది జాబితా విడుదల సందర్భంగా కేంద్రం భారీగా బలగాలను మోహరించిన విషయం తెలిసిందే. తాజాగా అందులో దాదాపు 10వేల సిబ్బందిని రాష్ట్రం నుంచి వెనక్కి పంపారు. అసోంలో శాంతి భద్రతలపై పూర్తి స్థాయి సమీక్ష జరిపిన కేంద్ర హోంశాఖ అదనపు బలగాల్ని క్రమంగా తొలగించాలని నిర్ణయించింది. అందులో భాగంగా శనివారం 100కంపెనీల బలగాల్ని వెనక్కి పంపారు. ఎన్నార్సీ తుది జాబితా విడుదల సందర్భంగా ఆగస్టు 31కి ముందు 218కంపెనీల భద్రతా సిబ్బందిని రాష్ట్రంలో మోహరించారు.

ఎన్నార్సీ తుది జాబితాలో 3.11కోట్ల మందికి చోటు దక్కగా..దాదాపు 19.06 లక్షల మందిని ప్రస్తుతానికి విదేశీయులుగా తేల్చారు. అయితే జాబితాలో లేనివారి కోసం కేంద్రం భరోసా కల్పించింది. ఎవరినీ వెంటనే విదేశీయులుగా పరిగణించబోమని.. విదేశీయుల గుర్తింపుపై ట్రిబ్యునల్‌లో తీర్పు వచ్చేవరకు ఎటువంటి చర్యలు ఉండవని స్పష్టీకరించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.