News

కాశ్మీర్ ని వదిలి వెళ్ళండి – పీఓకేలో ఇమ్రాన్ కు చేదు అనుభవం

939views

పాక్ ఆక్రమిత కశ్మీర్లో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు చేదు అనుభవం ఎదురైంది. పీవోకే ప్రజల సానుభూతి పొందాలని యోచిస్తున్న ఇమ్రాన్ ఖాన్ పీవోకేలోని ముజఫరాబాద్ పట్టణానికి వచ్చారు.  ‘బిగ్ జల్సా’ పేరిట నిర్వహించే భారీ ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చిన ఇమ్రాన్ ఖాన్ స్థానికుల ఆగ్రహాన్ని చవిచూశాడు.  ఘనస్వాగతం లభిస్తుందని ఆశించిన ఇమ్రాన్ కు అక్కడి ప్రజలు “గో బ్యాక్ నాజీ” అంటూ నినదించడమే కాకుండా, ‘కశ్మీర్ హిందుస్థాన్ సొంతం’ అంటూ ప్లకార్డులతో స్వాగతం పలకడంతో ఇమ్రాన్ ఖాన్ షాక్ అయ్యాడు.

కొన్నాళ్లుగా పీవోకే ప్రజలు పాకిస్థాన్ పై ఆగ్రహంతో ఉన్నారు. పాక్ ఆర్మీ అక్కడి అమాయకులను ఇప్పటికే తీవ్రవాదం వైపు వెళ్లేలా ప్రేరేపిస్తూ ఎన్నో నేరాలు కూడా చేసింది. అందుకే పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ప్రజలు పాకిస్థాన్ ఆర్మీ మీద గుర్రుగా ఉన్నారు. కొద్ది రోజుల క్రితం పాక్ ఆక్రమిత కాశ్మీర్ కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  పాకిస్థాన్ ఆర్మీ వెనక్కు వెళ్లాలంటూ నినాదాలు చేస్తూ అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున గుమికూడారు. ప్రజలంతా ఒక చోట ఉండగా.. వారి చుట్టూ పాకిస్థాన్ కు చెందిన భద్రతా బలగాలు ఉన్నాయి. ‘కాశ్మీర్ ను వదిలిపెట్టి వెళ్ళండి’ అంటూ పాక్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉన్నారు అక్కడి ప్రజలు. భారత్-పాకిస్థాన్ ల మధ్య కాల్పులు జరిగే సమయంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలను అడ్డుగా పెట్టుకుంటూ ఉన్నారు. స్థానికులను ఇంటి నుండి బయటకు గెంటేయడం.. హ్యూమన్ షీల్డ్ గా వారిని వాడుకోవడం ఎప్పటి నుండో చేస్తోంది పాకిస్థాన్ ఆర్మీ. అది అక్కడి ప్రజలకు నచ్చడం లేదు. ఇకపై ‘నైట్ రైడ్స్ ఉండకూడదు’ అంటూ ఆ ప్రజలు పెద్ద ఎత్తున నినాదాలు చేయడం మొదలు పెట్టారు.

1947 లో భారత్ కు స్వతంత్రం వచ్చిన తరువాత పాక్ ఆక్రమించుకున్న కశ్మీర్ ఇండియాలో అంతర్భాగంగా ఉంది. అయితే, పాక్ ఆ ప్రాంతాన్ని అక్రమంగా ఆక్రమించుకుంది. ఇది జగమెరిగిన సత్యం. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత కశ్మీర్ అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకు సాగుతున్నారు. ఆర్టికల్ 370 రద్దు చేసి పాకిస్తాన్ కు షాకిచ్చారు. ఇక, ఇప్పుడు పీవోకే దృష్టిసారించారు. పాకిస్తాన్ తో చర్చలు జరపాలంటే.. అది కేవలం పీవోకే గురించి మాత్రమేనని భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది.

ఇక, మోదీ ప్రభుత్వం పాక్ ఆక్రమిత కశ్మీర్ ను తిరిగి భారత్ లో కలిపేయడమే లక్ష్యంగా పెట్టుకుందని, మోదీ నెక్స్ట్ అజెండా అదే అని ఆ పార్టీ సీనియర్ నేత.. తాజాగా, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. ఇది కేవలం బీజేపీ అజెండా మాత్రమే కాదని, 1994 పివి నరసింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సైతం.. పార్లమెంట్ లో ఏకగ్రీవంగా దీనిపై తీర్మానం చేసిందని గుర్తుచేశారు.

అటు, ప్రభుత్వం ఓకే అంటే చాలు.. పీవోకేను స్వాధీనం చేసుకోవడానికి సిద్ధంగా వున్నామంటూ.. ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ సైతం ఇప్పటికే స్పష్టం చేశారు. ప్రస్తుతం జమ్మూ కశ్మీర్‌లో జరుగుతున్నదంతా తమ మంచి కోసమేనని జమ్మూ కశ్మీర్ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కశ్మీర్ ప్రజలు 30 ఏళ్లుగా ఉగ్రవాదాన్ని ఎదుర్కొన్నారనీ… ఇకపై అక్కడ శాంతి నెలకొనేలా సహకరించాలని రావత్ ఈ సందర్భంగా కోరారు. శాంతియుత వాతావరణం ఏర్పడితేనే ఇన్నాళ్లూ ఏమి కోల్పోయారన్నది అక్కడి ప్రజలకు అర్థమవుతుందన్నారు.